తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి అన్యమత ప్రచారం దుమారం రేపుతోంది.వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఇలా తరచూ తిరుమలలో అన్యమత ప్రచారానికి సంబంధించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.
మొదట్లో తిరుమలకు వెళ్లే బస్సు టికెట్ల వెనుక జెరుసలెం యాత్ర ప్రచారాలు, ఆ తర్వాత టీటీడీలో కొన్ని వందల మంది అన్యమతస్తులు ఉన్నట్లు వచ్చిన వార్త, అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టిన ఓ పుస్తకంలో ఏసును కీర్తిస్తూ ఉన్న పేజీలు.ఇలా ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది.
తాజాగా మరోసారి అధికారిక వెబ్‌సైట్‌లోనే శ్రీ ఏసయ్య పదం కనిపించడం సంచలనం రేపింది.దీనికి సంబంధించిన వార్త స్థానిక, జాతీయ మీడియా పత్రికలన్నింట్లోనూ వచ్చింది.అయితే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఆంధ్రజ్యోతిది మాత్రమే ఆ తప్పు అన్నట్లు మాట్లాడటంపై ఆ పత్రిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

తప్పు జరిగిందని చెప్పడం తమ తప్పా అని ప్రశ్నించింది.అయినా టీటీడీ చైర్మన్ సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని వాదించింది.ఒకసారి ఆ తప్పిదం గూగుల్ వల్ల జరిగిందని, దాంతో తమకు సంబంధం లేదని అంటారు.
మరోసారి గూగుల్‌లో అంత సులువుగా పొరపాటు జరగదంటారు.గూగుల్ తప్పిదం వల్ల వెబ్‌సైట్‌లో నుంచి పంచాంగాన్ని తొలగించాల్సి వచ్చిందని అంటారు అంటూ నిలదీసింది.
అయినా అన్ని పత్రికలూ ఈ తప్పిదాన్ని ఎత్తి చూపితే.ఆంధ్రజ్యోతిని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారంటూ ప్రశ్నించింది.అధికారిక వెబ్‌సైట్‌లో ఎలాంటి తప్పిదం జరగలేదని చెప్పారు.కానీ పంచాంగాన్ని ఎందుకు తొలగించారన్నది చెప్పడం లేదు.
ఒకవేళ దానిని చేరిస్తే ఏసయ్య అనే పదం మళ్లీ వస్తుందని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పడం గమనార్హం.
ఏడు నెలలుగా పంచాంగంలో ఏసయ్య అనే పదం వస్తున్నా ఎందుకు గుర్తించలేదు అని అడిగితే.
ఆ పదాన్ని ఈ మధ్యే ఎవరో కుట్రపూరితంగా ఇరికించారని ఆయన అన్నారు.మొత్తంగా వెబ్‌సైట్‌లో అన్యమత ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తప్పంతా గూగుల్‌దే అన్నట్లుగా మాట్లాడారు.