ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకునే కొన్ని నిర్ణయాలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నష్టం చేకూర్చేలా ఉన్నాయి.అందులో ముఖ్యమైనది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ) రద్దు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కుదిరిన ఈ ఒప్పందాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు జగన్ వచ్చీ రాగానే ప్రకటించారు.దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.

నేరుగా కేంద్రమే రంగంలోకి దిగి జగన్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇలా ఏకపక్షంగా ఒప్పందాలను రద్దు చేయడం వల్ల అది దేశవ్యాప్తంగా విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.కేంద్రమే కాదు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టిన ఫ్రాన్స్, కెనడా, జపాన్‌లాంటి దేశాలు కూడా ఏపీ నిర్ణయాన్ని తప్పుబట్టాయి.దీంతో వెనక్కి తగ్గిన జగన్.అన్ని ఒప్పందాలను రద్దు చేయబోమని, అక్రమాలు జరగాయని అనుమానం ఉన్న కొన్నింటినీ పునఃసమీక్షిస్తామని చెప్పింది.
అయితే భవిష్యత్తులో ఇలా ఏ రాష్ట్రం కూడా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేసుకోకుండా.
ఓ కొత్త చట్టం తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.ఏపీ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఓ తప్పుడు సంకేతాన్ని పంపిందని, ఇలాంటివి జరగకుండా ఉండటానికే ఓ చట్టం తేనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

ఒకవేళ భవిష్యత్తులో ఏ రాష్ట్రమైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.కొత్త చట్టం ప్రకారం భారీగా జరిమానా విధిస్తారని కూడా ఆ అధికారి చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు.అందుకే ఇలాంటి వాటిని అరికట్టడానికి కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్రం ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ద మింట్ అనే బిజినెస్ పత్రిక వెల్లడించింది.
ఏపీలో 5.2 గిగా వాట్ల సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.21 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.గోల్డ్‌మ్యాన్ సచ్స్, బ్రూక్‌ఫీల్డ్, సాఫ్ట్‌బ్యాంక్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్‌లాంటి విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.
మొత్తానికి జగన్ తీసుకున్న నిర్ణయం కేంద్రాన్ని ఓ కొత్త చట్టం వైపు పురిగొల్పింది.