పాకిస్థాన్ మార్గం ద్వారా 50 వేల మెట్రిక్ టన్నుల గోధుములను, వైద్య సామాగ్రిని అఫ్గానిస్థాన్‌కు పంపించాలని భారతదేశం నిర్ణయించింది.ఆకలితో అలమటిస్తున్న అఫ్గానిస్థాన్‌కు మానవతా దృక్పథంతో గోధుమలు అందిస్తామని భారతదేశం ప్రకటించింది.
కానీ పాకిస్థాన్ తమ భూభాగం ద్వారా గోధుమలను రవాణా చేసేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.దాదాపు నెల రోజుల తర్వాత అంటే ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ దీనిపై స్పందించారు.
తమ ప్రభుత్వం పాకిస్థాన్ భూమార్గం గుండా గోధుములు రవాణా చేయడానికి అనుమతిస్తుందని తెలిపారు.
భారత్ ప్రకటించిన రూ.500 కోట్ల విలువైన గోధుములను పాకిస్థాన్ మీదుగా తరలించేందుకు పాక్ ప్రభుత్వం అంగీకరించడం అక్కడి ప్రజలకు శుభవార్తగా చెప్పుకోవచ్చు.ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో ఇస్లామాబాద్‌లో నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో భారత సహాయం గురించి అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే అఫ్గాన్‌కు ఉచితంగా గోధుమలు అందించడానికి భారత్ కి మార్గం సుగమం కావడంతో రవాణా విధివిధానాలను ఖరారు చేసుకోవాల్సిందిగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూచించారు.ఆకలి, ఆర్థిక సంక్షోభంలో మునిగితేలుతున్న అఫ్గానిస్థాన్‌కు అండగా ఉండటం ప్రపంచ దేశాల బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు.

అక్టోబర్ నెలలో ఇండియా అఫ్గాన్‌కు 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను ఉచితంగా అందజేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది.ఇందుకు వాఘ సరిహద్దు మీదుగా గోధుమలను తరలించేందుకు భారీ ట్రక్కులను అనుమతించాలని పాక్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.అయితే నెల రోజుల తర్వాత పాక్ ఇందుకు అనుమతినిచ్చింది.వాస్తవానికి ప్రస్తుతం అఫ్గాన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులనే తమ దేశం మీదుగా రవాణా చేసేందుకే పాకిస్థాన్ అంగీకరిస్తోంది.
ఇప్పుడు అఫ్గాన్ ప్రజల కోసం ఇండియా నుంచి సరుకు రవాణాకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది.అయితే గోధుమలను ఎలా రవాణా చేయాలి? ట్రక్కులను ఎలా పంపించాలి? తదితర విషయాల్లో పాక్ పెట్టే నిబంధనల ప్రకారమే భారత్ అఫ్గాన్ కు గోధుమలను పంపించాల్సి ఉంటుంది.