తెలంగాణలో బీజేపీ పరిస్థితి చూసుకుంటే గతం కంటే బాగా మెరుగుపడింది.రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చే అంత స్థాయికి ఆ పార్టీ బలపడింది.
బలమైన నాయకులతో పాటు, కేంద్ర బీజేపీ పెద్దల సహకారం తెలంగాణ అధికార పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలు ఇవన్నీ బీజేపీకి కలిసి వస్తున్నాయి.గతంలో దుబ్బాక ,హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు జెండా ఎగురవేయడంతో , ఆ పార్టీ 2023 ఎన్నికల్లోనూ విజయం సాధించగలదు అనే ధీమా ఆ పార్టీ పెద్దలలోనూ పెరిగింది.
దీనికి తగ్గట్లుగానే తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రజా ఉద్యమాలు , ఆందోళనలు బీజేపీ చేపడుతూ మరింత బలపడేందుకు ప్రయత్నిస్తోంది.
ఇంత వరకు బాగానే ఉన్నా, బీజేపీ లో పెరిగిపోతున్న గ్రూపు రాజకీయాలు ఆ పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది.
ముఖ్యంగా రాష్ట్ర స్థాయి నేతల మధ్య గ్రూపు రాజకీయాలు బాగా పెరిగిపోయాయి.ఎవరికి వారు తామే కీలక నాయకులు అన్నట్టుగా వ్యవహరిస్తూ , సొంత పార్టీలోనే ప్రత్యర్థులను పెంచుకునే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది.
రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా , మండల స్థాయిలోనూ గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.అక్కడ వర్గపోరు, ఆధిపత్యపోరు పెరిగిపోవడంతో బీజేపీ ఎదుగుదలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ గ్రూపు రాజకీయాల కారణంగా ఇప్పటికే కొంతమంది నాయకులు పార్టీ మారిపోగా, మరికొంతమంది మారే ఆలోచనలో ఉన్నారు.

ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ,ఈటెల రాజేందర్ , కిషన్ రెడ్డి మూడు వర్గాలుగా ఉన్నారని, ఎవరికి వారే తామే తెలంగాణ బీజేపీ లో కీలకం అనే భావంతో ఉండగా, జిల్లాలోనూ ఇదే తరహా వాతావరణం నెలకొనడం, బీజేపీ కి ఇబ్బందికరంగా మారిందట.ఇప్పుడు తెలంగాణ బీజేపీని జనాల్లోకి తీసుకువెళ్లడం సంగతి పక్కనపెడితే, ఇప్పుడు సొంత పార్టీని చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట.