ఏపీలోని ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మరోసారి చర్చలు జరపనుంది.ఈ మేరకు సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రుల బృందంతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు.పెండింగ్ సమస్యల ( Pending issues )పరిష్కారం కోసం సమ్మె బాట పడతామని ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది.ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అదేవిధంగా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ( Retirement benefits )రిలీజ్ చేయాలంటూ ఉద్యోగులు పట్టు పడుతున్నారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన ఉద్యోగ సంఘాలు ఎల్లుండి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగాలని పిలుపునిచ్చాయి.అలాగే ఈ నెల 15, 16న భోజన విరామంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.17న ర్యాలీలు, 20న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నారని వెల్లడించారు.ఇక 21 నుంచి 24 వ తేదీ వరకు జిల్లాల్లో పర్యటిస్తామంటున్న ఉద్యోగ సంఘాల నేతలు 27న చలో విజయవాడకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.