రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనాలను ఆకట్టుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ప్రయత్నాలు చేస్తుంది.దీనిలో భాగంగానే అనేక ఎన్నికల హామీలను ఇస్తూ, జనాల దృష్టిని కాంగ్రెస్ వైపు మళ్ళించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అనేక ఎన్నికల హామీలను ప్రకటించారు.సీనియర్ సిటిజన్ లు, దివ్యాంగులు, కళాకారులు వితంతువులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నెలకు 4000 పెన్షన్ అందిస్తామని ప్రకటించారు.ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జన గర్జన కార్యక్రమం ముగిసిన ఒకరోజు తర్వాత రేవంత్ రెడ్డి ఈ హామీలను ప్రకటించారు.75 గా ఉన్న పింఛన్లను గతంలో 200కు కాంగ్రెస్ పెంచిందని , కేసీఆర్( KCR ) ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురుచూస్తున్న పెండింగ్ లో ఉన్న పది లక్షల మంది దరఖాస్తులను కలుపుకుని, 55 లక్షల మందికి నాలుగు వేల పెన్షన్ ఇస్తామని రేవంత్ చెబుతున్నారు.

జీతాలు, పెన్షన్ల ను ఇవ్వలేక తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని, రాష్ట్ర వనరులను సక్రమంగా వినియోగించగలిగితేనే వీటిని అమలు చేయడం సాధ్యమవుతుందని రేవంత్ చెబుతున్నారు.‘ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38వేల కోట్ల అంచనా తో ప్రారంభించి కాలేశ్వరం ప్రాజెక్టుగా( Kaleshwaram project ) రీడ్ డిజైన్ చేశారని, దీనికి 81 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారని, ప్రస్తుతం అంచనా 1,49131 కోట్లు అని, ఇప్పటి వరకు 85 వేల కోట్లు చెల్లించాలని రేవంత్ తెలిపారు.అలాగే పాలమూరు -రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ను రీ డిజైన్ చేసి 16 వేల కోట్ల నుంచి 58 వేల కోట్లకు పెంచారని , అది ఇప్పుడు లక్ష కోట్లకు చేరిందని, ఈ అంశాలపై కాంగ్రెస్ తో చర్చకు కేటీఆర్, హరీష్ రావు( KTR, Harish Rao ) సిద్ధంగా ఉన్నారా అని రేవంత్ సవాల్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకుంటామని , అలాగే ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి వ్యవహారాలను వెలికి తీస్తామని రేవంత్ చెబుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఎన్నికల హామీలన్నిటిని అమలు చేసే బాధ్యత తమదే అన్నట్లుగా రేవంత్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అతి త్వరలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
ప్రజా సంక్షేమ పథకాల ద్వారానే ప్రజలను ఆకట్టుకుని పైచేయి సాధించే దిశగా తెలంగాణ కాంగ్రెస్ ను ముందుకు తీసుకువెళ్లే ఆలోచనతో రేవంత్ ఉన్నారు.