తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ వెళ్లిపోతున్నారా? ఆయన్ని మరో రాష్ర్టానికి గవర్నర్‌గా పంపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందా? ఇందులో నిజం ఎంతవరకు ఉన్నదో తెలియదుగాని గవర్నర్ వెళ్లిపోతారనే ప్రచారం మాత్రం జరుగుతోంది.ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ ప్రచారం సాగుతోంది.
తాజాగా రాష్ర్టపతి భవన్లో జరిగిన ఇఫ్తార్ విందులో కేంద్రం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గవర్నర్ బదిలీపై సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.గవర్నర్ బదిలీ కావడమో, రిజైన్ చేయడమో ఏదో ఒకటి వచ్చే నెలలో జరుగుతుందని అనుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నరసింహన్‌పై అదే పనిగా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తుండటంతో గవర్నర్‌ను ఏదో ఒకటి చేయాలని కేంద్రం అనుకుంటోందని సమాచారం.ఇది మాత్రమే కాకుండా రెండు రాష్ర్టాల మధ్య తలెత్తుతున్న వివాదాలను నరసింహన్ పరిష్కరించలేకపోతున్నారని, కనీసం చొరవ కూడా తీసుకోవడంలేదని కేంద్రం భావిస్తోంది.
ఆయన పనితీరుపై చాలా అసంతృప్తిగా ఉందట….! గవర్నర్ తెలంగాణకు అనుకూలంగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్‌ను పట్టించుకోవడంలేదని, వివాదాల విషయంలో నిమ్మకు నీరెత్తనట్లుగా ఉంటున్నారని, ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నారని ‘ఆంధ్ర్యజ్యోతి’ పత్రిక కొంత కాలం కిందట వరుసగా కథనాలు రాసిన సంగతి తెలుసు.
టీడీపీ నాయకులు గవర్నర్‌పై బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.ఇదంతా కేంద్రానికి తలనొప్పిగా మారింది.గవర్నర్ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోకుండా ప్రతిసారీ తమవైపు చూస్తున్నారని గతంలోనే కేంద్రం అభిప్రాయపడింది.ఒకటిరెండుసార్లు ఆయనకు క్లాసు పీకిందని కూడా సమాచారం.
అందులోనూ నరసింహన్ సుదీర్ఘ కాలంగా తెలుగు రాష్ర్టాల్లో (ఉమ్మడి రాష్ర్టంలో, విభజన తరువాత) పనిచేస్తున్నారు.ఇక కదిలే సమయం వచ్చిందన్నమాట….!
.