సోషల్ మీడియా వచ్చాక ఎక్కడెక్కడో దాగివున్న రియల్ హీరోలు బయటకి వస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో.అవును, సాధారణంగా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం….
కుక్క బావిలో పడిపోతే తీయడమో, పక్షులు వలలో చిక్కుకుపోతే చిక్కులు విప్పడమో, ముసలి వాళ్ళు ట్రాఫిక్ లో రోడ్డు దాటకపోతే దాటించడమో ఇలా అనేక చర్యలు సినిమా హీరోలు చేస్తే ఆ తంతు చూసి వెంటనే హీరోయిన్ వారికి పడిపోతుంది.కానీ దైనందిత జీవితంలో చాలామంది అదేవిధంగా ప్రవర్తిస్తూ వుంటారు.
కానీ అలాంటివారికి ఒకప్పుడు తగిన గుర్తింపు ఉండేది కాదు కదా! పట్టించుకొనేవారు కూడా ఉండేవారు కాదు.
కానీ నేడు పరిస్థితి మారింది.
మనచుట్టూ కళ్ళు వున్నాయి.అదేనండి స్మార్ట్ ఫోన్ కెమెరా కళ్ళు.
అవి మనము ఏం చేసినా ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి.అవును, తాజాగా అలాంటి ఓ సంఘటన ట్రాఫిక్ పోలీసుని హీరోని చేసింది.
బెంగుళూరు ట్రాఫిక్ పోలీసు తన ప్రాణాలను పణంగా పెట్టి పక్షి ప్రాణాలను కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దాంతో నెటిజన్లందరూ ట్రాఫిక్ పోలీసును ప్రశంసిస్తూ పోస్టుని షేర్ చేస్తున్నారు.
ఆ వీడియోలో వున్నది బెంగళూరులోని రాజాజీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సురేష్. ఈ వీడియోను బెంగళూరులోని వెస్ట్ ట్రాఫిక్ డివిజన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ కులదీప్ కుమార్ ఆర్ జైన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా వెలుగు చూసింది.దాంతో సురేశ్‌ను ప్రశంసిస్తూ లక్షలాది మంది కామెంట్లు చేయడం విశేషం.
హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా ఇదే వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, ‘మా ట్రాఫిక్ పోలీసులు కూడా రెస్క్యూ పనిలో పాల్గొంటున్నారు… అని ఆకాశానికెత్తేశారు.