నల్లగొండ జిల్లా:వేములపల్లి మండలం భీమారం- మిర్యాలగూడ ( Bheemaram )ప్రధాన రహదారి తనను గత పాలకులు కాంట్రాక్టర్ కి కొమ్ముకాస్తూ తొమ్మిదేళ్లుగా గాలికొదిలేశారని,ఇప్పుడైనా నాపై దృష్టి సారించి అభివృద్ధి చేయాలని దీనంగా వేడుకుంటుంది.భీమారం-మిర్యాలగూడ ( Miryalaguda )హదారి దీనావస్థ ఇలా ఉంది.
సూర్యాపేట నుండి శెట్టిపాలెం సమీపంలోని అద్దంకి-నార్కెట్పల్లి జాతీయ రహదారి వరకు 28 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 9 ఏళ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి.ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాకుండా నిర్లక్ష్యానికి గురైంది.
ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు జిల్లాలతో పాటు వరంగల్ నుండి గుంటూరుకు తక్కువ సమయంలో ప్రయాణించడానికి వీలుంటుంది.ఈ మార్గం గుండా రోజుకు వందలాదివాహనాలు,వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
గత పాలకుల నిర్లక్ష్యం ఈ రహదారి పాలిట శాపంగా మారిందని,ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్కొలువుదీరి నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) రాష్ట్ర ఆర్ అండ్ బి మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మళ్ళీ ఈ ప్రాంత ప్రజల ఆశలకు రెక్కలొచ్చాయి.ఈసారైనా రోడ్డు పనులు పూర్తయి ప్రజల రవాణాకి అడ్డంకులు తొలగిపోతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.
సూర్యాపేట నుంచి మిర్యాలగూడ వెళ్లే ప్రధాన రహదారి నకిరేకల్, మిర్యాలగూడ,సూర్యాపేట మూడు నియోజకవర్గాలపరిధిలోని శెట్టిపాలెం, మొలకపట్నం,రావులపెంట,లక్ష్మీదేవిగూడెం,ఆమనగల్లు,భీమారం,వెదురు వారి గూడెం తండా,కుసుమవారి గూడెం గ్రామాలను కలుపుతూ వెళుతుంది.ఈ రోడ్డునిర్మాణం లోపం పూర్తిగా గత పాలకుల నిర్లక్ష్యమేనని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ముగ్గురు ఎమ్మెల్యేలు, అందులో ఒకరు మంత్రిగా ఉండి కూడా రోడ్డును విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.భీమవరం-మిర్యాలగూడ రోడ్డు నిర్మాణంలో భాగంగా వేములపల్లి కల్వర్టులు ఆధునీకరణ ఇప్పటివరకు కూడా పూర్తికాలేదు.
నిర్మాణంలో 9 బాక్స్ కలవర్టులు ఉండగా గూనల ద్వారా నిర్మించాల్సిన కల్వర్టులు 50కి పైగా ఉన్నాయి.బాక్స్ బ్రిడ్జి నిర్మాణంలో ఆరు నిర్మాణం పూర్తి కాగా మరో మూడు పెండింగ్ లో ఉన్నాయి.
పూర్తయిన బిడ్జీల వద్ద కూడా మట్టి పోయకపోవడం వలన ప్రయాణికులు తాత్కాలిక రోడ్డుపై ప్రయాణించాల్సి వస్తుంది.గూనల నిర్మాణంలో 30 నిర్మాణాలు పూర్తి కాగా మరో 20 పాటు పెండింగ్లో ఉన్నాయి.
ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకచోట రోడ్డు తొవ్వి గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.గ్రామాలలో కంకర మాత్రమే పరిచి బీటీ వేయకపోవడం వలన దుమ్ము వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని పలు గ్రామాల్లో పలుమార్లు రాస్తోరోకోలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది.దీనితో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.