నల్లగొండ జిల్లా: మునుగోడు రాజకీయాలు గత ఉప ఎన్నికల్లో దేశవ్యాప్త ప్రచారం సంతరించుకున్న విషయం తెలిసిందే.ఇక్కడ ఏమాత్రం పట్టులేని బీజేపీ ఏకంగా ఉప ఎన్నికల్లో గెలిచినంత పని చేసింది.
దానికి కారణం ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అనేది టాక్.కానీ,అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక్కడ బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోవడానికి కూడా కారణం రాజ్ గోపాల్ రెడ్డే కావడం కాదనలేని నిజమంటున్నారు.
అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన చలమల్ల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో బీజేపీ గూటికి చేరి అభ్యర్ధిగా బరిలో నిలిచారు.దీనితో ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న నేతలు తీవ్ర అసంతృప్తితోనే పార్టీలో కొనసాగుతున్నారు.
కాషాయ దళంలో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి కాస్తా చలమల్ల తీరుతో తీవ్రస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి కొత్త పాత కమలం నేతలను సమన్వయ పరచడంలో ఇబ్బంది పడుతున్నారని,తనవర్గం వారికే బాధ్యతలు అప్పగించి, పాత వారికి ప్రాధాన్యత ఇవ్వడంలేదని గంగిడి మనోహర్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇంత కాలం పార్టీనే నమ్ముకొని నిస్వార్థంగా పని చేసిన తమకు ప్రాధాన్యత లేకపోవడంపై చలమల్లతో చర్చిద్దామంటే సమయం ఇవ్వడం లేదని,ఆయన సోదరుడు నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని,కొన్ని ప్రాంతాలలో పార్టీ ఇంచార్జీలు తమను చిన్న చూపు చూస్తున్నారని,
ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో నష్టపోవడం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నట్లు వినికిడి.ఇదిలా ఉంటే మిత్రపక్షం జనసేన పార్టీని అంతగా పట్టించుకోకుండా బీజేపీ ఒంటరిగా వెళ్తునట్టే కనిపిస్తుంది.
కేవలం చౌటుప్పల్ మండలంలో మాత్రమే జనసేనకు సమాచారం వస్తుందని,ఇతర మండలాల్లో ఎటువంటి సమాచారం అందడం లేదని పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మొత్తంగా మునుగోడులో కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా బీజేపీ అభ్యర్ధి చలమల్లకు ఎన్నికల పయనం తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.