యాదాద్రి భువనగిరి జిల్లా: సాధారణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించకపోతే ముక్కుపిండి వసూళ్లు చేసే పంచాయతీ కార్యదర్శులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పరిశ్రమల పట్ల ఉదాసినత వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తన్నాయి.పరిశ్రమల నుంచి కమర్షియల్ పన్నులు వసూళ్లు చేయకుండా వివిధ రూపాల్లో మినహాయింపు కలిగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని తెలుస్తోంది.
ఆన్లైన్ అసెస్మెంట్ లో వివిధ పరిశ్రమలను రెసిడెన్సియల్ గా నమోదు చేయడం ద్వారా ఆయా పరిశ్రమల నుంచి రావలిసిన పన్నుల్లో చాలా వ్యత్యాసం వస్తుంది.చౌటుప్పల్ మండలంలోని మల్కాపూర్ గ్రామ పరిధిలోని ఓ పరిశ్రమను ఏకంగా గుడి (టెంపుల్) కింద అసెస్మెంట్ చేసి పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది.
ఇంత భారీ మొత్తంలో మినహాయింపు ఇవ్వడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలియాల్సిఉంది.ఆయా గ్రామాలలో నెలకొలిపిన పరిశ్రమలను రెసిడెన్సియల్ క్రింద అసెస్మెంట్ చేయడం ద్వారా గ్రామ పంచాయతీలకు రావల్సిన ఆదాయం కోల్పోవడంతో అభివృద్ధి కుంటిపడుతుందనే వాదన బలంగా వినిపిస్తుంది.
గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొట్టడంలో తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఉంది.గ్రామ పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం కారణంగా పరిశ్రమల నుంచి వసూళ్లు కావలిసిన పన్నుల్లో భారీ వ్యత్యాసం నెలకొంది.ప్రతి ఏడాది ఆడిట్ చేసే అధికారులు,స్థానిక ఎంపిడివో,ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి రాకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.కాగా పరిశ్రమల నుంచి సంబంధిత అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టడంతోనే వీటిని చూసిచూడనట్లు వదిలేస్తునరని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రెసిడెన్సియల్ గా నమోదు చేసిన పరిశ్రమలను గుర్తించాలని, పరిశ్రమల నుంచి రావలిసిన పన్నులు వసూళ్లు చేసి గ్రామభివృద్ధి చేప్పటాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.