తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుతోంది .ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఎన్నికల పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.
ఇక్కడ గెలిచి తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నాల్లో టిఆర్ఎస్ అధిష్టానం ఉంది. అందుకే పూర్తిగా ఈ నియోజకవర్గం పైనే దృష్టి పెట్టారు.
తెలంగాణలో బిజెపి బాగా బలం పెంచుకోవడం, తమకు గట్టి సవాల్ విసిరే స్థాయికి వెళ్లడం, ఇక బిజెపి అగ్ర నేతలను టార్గెట్ చేసుకుంటూ పదేపదే తెలంగాణలో పర్యటనలు చేస్తూ, విమర్శలు చేస్తూ ఉండడం వంటి విషయాలను సీరియస్ గానే తీసుకుంది.అందుకే మునుగోడులో బిజెపిని ఓడించి తెలంగాణలో ఆ పార్టీ బలం ఏమీ లేదనే విషయాన్ని రుజువు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
దీనిలో భాగంగానే బిజెపిలో కీలక నాయకులుగా ఉన్న వారిని గుర్తించి వారిని తమ పార్టీలో చేర్చుకునే వ్యూహానికి వ్యూహరచన చేసింది.అంతేకాకుండా టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన నేతలను మళ్లీ వెనక్కి రప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దీనిలో భాగంగానే బిజెపిలో కీలక నేతగా ఉన్న దాసోజు శ్రవణ్ ను , ఉద్యోగ సంఘాల నేతగా ఉద్యమ సమయంలో కెసిఆర్ కు అండగా నిలిచిన స్వామి గౌడ్ ను బిజెపి నుంచి టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు.వీరే కాకుండా మరికొంతమంది బీజేపీ కీలక నేతలను చేర్చుకునే పనుల్లో కొంతమంది టిఆర్ఎస్ కీలక నాయకులకు ఆ బాధ్యతలను అప్పగించారు.
మునుగోడు పోలింగ్ సమయం దగ్గర పడిపోతుండడం, ఇంకా 12 రోజులు మాత్రమే సమయం ఉండడంతో చేరికలను మరింత ఉదృతం చేశారు.మునుగోడు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలను టార్గెట్ చేసుకుని చేరికలపై దృష్టి పెట్టారు.

ఇప్పటికే టీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను చేర్చుకుని టిఆర్ఎస్ కు బిజెపి జలక్ ఇచ్చింది.దీంతో బిజేపి లోని కీలక నేతలను టిఆర్ఎస్ లో చేర్చుకోవడమే టార్గెట్ గా ఆ పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది.ఈ 12 రోజుల సమయంలో బిజెపి నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని టిఆర్ఎస్ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తూ బిజెపిని టెన్షన్ పెట్టేస్తున్నారు.దీంతో ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉంది అనే విషయం పై దృష్టి పెట్టి ఎవరు పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.