మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న ప్రత్యేక సందర్బంగా అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఆగస్టు 13,14,15 తేదీలలో ఇలా మూడు రోజుల పాటు 20 కోట్ల మంది ఇళ్ల మీద జాతీయ పతకాన్ని ఎగరేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అందుకు అనుమతి ఇవ్వడం ఎంతైనా హర్షణీయం.ఇదే మాదిరి మన జాతిపిత గాంధీజీ 1930 లో దేశభక్తిని ప్రేరేపించడానికి తెల్లవారుజామున దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ‘ ప్రభాత్ పేరి నిర్వహించేవారు.
ఆనాటి మహోన్నత కార్యాన్ని స్ఫూర్తిగా తీసుకోని ఇప్పుడు ఇంటింటా త్రివర్ణ పతాకం ఎగరాలంటే ఇలాంటి ప్రభాత్ భ్రమణాలు ఎంతో అవసరమని కేంద్రం తెలియజేయడం ఎంతైనా ఓక ఆరోగ్యకర, శుభ పరిణామం.
ఈ మహోజ్వల ఘట్టం కొట్లాది మంది భారతీయుల్లో దేశభక్తిని పెంపోదించడంతో పాటు మన స్వాతంత్ర్య సమరయోధులపై గౌరవ, మర్యాదలు మనలో మరింతగా ఇనుమడించేలా మన కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోట్లాది మంది భారతీయుల్లో జాతీయ స్ఫూర్తిని నింపడం తథ్యం.
ఇందులో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వ తేది వరకు 20 కోట్ల మంది భారతీయులు చేయాల్సిన కొన్ని అపురూప కార్యక్రమాలను గురించి కేంద్రం చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చింది.ఇందులో తెలియపరచినట్లుగా ఓక త్రివర్ణ పతాకంతో పిల్లలు, పురుషులు, మహిళలు అందరూ కలిసి ఓక ఫ్యామిలీ ఫొటోకు అంకురార్పణ గావించాలని, అలాగే మన దేశ స్వాతంత్ర్యానికి సంబందించిన పుస్తకాలు కొన్ని అయిన ప్రతి ఇంట్లో దర్శనం ఇచ్చేలా ఉండాలని అంటే గాంధీజీ ఆత్మకథ ‘ సత్య శోధన్ ‘, నెహ్రు రచనలు, భగత్ సింగ్ జీవితకథ, మన తెలుగు యోధులు అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు వంటి వారి పరిచయ పుస్తకాలు తప్పక ఉండాలని కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఈ అమూల్యమైన సందేశం మనందరిలో నర నరాన, అడుగడుగునా దేశభక్తిని ఇనుమడింపజేసేదే అనడం లో ఎలాంటి సందేహం లేదు.

అంతేగాకుండా నలుగురిలో కాకుండా ప్రతి ఒక్కరూ అక్షర దోషం లేకుండా ‘ జనగణమన ‘, వందేమాతరం, రఘుపతి రాఘవ రాజారాం, సారే జహసే అచ్చా వంటి దేశభక్తి గీతాలు వీధుల్లో, అపార్ట్ మెంట్ లలో మనమంతా పాడటం తో పాటు మన పిల్లల చేత బాగా పాడించేలా చేయడం తో పాటు, వాటికీ సంబందించిన క్విజ్ లు పెట్టాలని కేంద్రం సూచించడం ఎంతైనా అభినందనీయం, అక్షరాల ఆచరించదగ్గ విషయం.ఇంకా చెప్పుకుంటూపోతే గాంధీ, నెహ్రు, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, భగత్ సింగ్, అబ్దుల్ కలాం ఆజాద్ వంటి మహా నాయకుల ఫొటోలు మన డ్రాయింగ్ రూంలలో ఉండాలని, కమ్యూనిటీ ఉత్సవాలు వీదుల్లో, వాడల్లో, అపార్ట్మెంట్ లలో ఈ మూడు రోజులు జరుపుకోవాలని అంటే ఫ్యాన్సీ డ్రెస్ లు, నాటకాలు, ఏకపాత్రాభినయం ఇవన్నీ పెద్దలు, పిల్లలు కలిసి చేయాలని ఫోన్ పలకరింపుల్లో’ ‘ హలో ‘ బదులు వందేమాతరం, బై బదులు జై హింద్ వాడితే ఆ అనుభూతే గొప్పది అని మన కేంద్రప్రభుత్వం ప్రజలకు సెలవు ఇవ్వడం ఎంతైనా ఓక ఆశక్తికరమైన పరిణామం.
ఏదిఏమైన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టడం కోసం వేలాది మంది దేశ భక్తులు తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేపథ్యంలో, వారి త్యాగాలను చాలా గొప్పగా మనమంతా ఒక్కసారి మననం చేసుకునే నిమిత్తమై, జ్ఞాపకం తెచ్చుకునే పనిలో భాగంగా వారు దేశానికీ అందించిన అజరామమైన, వెలకట్టలేని సేవలను తలుచుకుంటూ ఈ మూడు రోజులు అన్నదానం, అనాధలకు సహాయం, ఆపదలో వున్నవారికి చేదోడు పనులు చేయడం వంటి సమున్నత కార్యక్రమాలు చేపడితే స్వర్గం లో కొలువై వున్న వారి ఆత్మలు శాంతించడం తో పాటు, వారికి ఈ విధమైన ఆదర్శవంతమైన రీతిలో దేశభక్తిని పెంపొందించేలా వారికి గొప్ప నివాళులు మనమంతా అర్పించినట్లవుతుంది.ఏమైనా రాబోయే ఆ మూడు రోజులు ప్రతి ఒక్కరి ఇంటిలో త్రివర్ణ పతాకం రెపరెప లాడేలా, దేశ పటాన్ని కాషాయ, దవళ, ఆకుపచ్చ వర్ణాలతో మిల మిల మెరిసేలా సోషల్ మీడియా ద్వారా చాలా గొప్పగా ప్రచారం చేయాల్సిన గురుతర బాధ్యత కోట్లాది మంది భారతీయుల భుజస్కందాలపై ఎంతైనా వుంది.
బోలో భారతమాతాకీ జై, మేరా భారత్ మహాన్, జైహింద్.