యువతకు మీ విజయం స్ఫూర్తి అని మంత్రి ప్రశంసలు,సివిల్స్ ఇంటర్వ్యూ జరిగిన తీరును అడిగి తెలుసుకున్న హరీశ్ రావు,దేశం మెచ్చే విధంగా, తెలంగాణ గర్వించేలా సేవలు అందించాలని ఆకాంక్ష,విజేతలను శాలువా కప్పి సత్కరించిన మంత్రి హరీశ్ రావు
యూపీఎస్సీ -2021లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును బుధవారం కోకాపేటలోని తన నివాసంలో కలిసారు. జి సుధీర్ రెడ్డి (69), స్నేహ (136), చైతన్య రెడ్డి (161), రంజిత్ కుమార్ (574), స్మరణ రాజ్ (676) సహా, సివిల్స్ సబ్జెక్ నిపుణురాలు, మెంటార్ బాలలత మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు వారికి శాలువా కప్పి సత్కరించారు.ఎంతో కష్టపడి, దేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీస్ చేరుకోవడం గొప్ప విషయం అని మంత్రి వారిని ప్రశంసించారు.
తెలంగాణ గర్వించేలా, దేశం మెచ్చేలా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.బాలలత గారు లాంటి మెంటార్స్ సలహాలు, సూచనల వల్ల విజయ అవకాశాలు మరింత చేరువ అవుతాయన్నారు.
పోలియో మహమ్మారి రూపంలో వైకల్యం కలిగినా, గెలుపు మీద కసితో రెండు సార్లు సివిల్స్ ర్యాంకు సాధించడం గొప్ప విషయం అని బాలలతను మంత్రి అభినందించారు.దేశం కోసం సివిల్స్ విజేతలను తయారు చేయాలని సంకల్పించి ఎంతో మందిని తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.
ఇంటర్వ్యూలో తెలంగాణపై ప్రశ్నలు….
సివిల్స్ విజేతలతో కలిసి మంత్రి అల్పాహారం చేస్తూ, సివిల్స్ ఇంటర్వ్యూ జరిగిన తీరు గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విజేతలు వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ఇక్కడి విప్లవాత్మకమైన విధానాలు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ వంటి పథకాలు, అవి సాధించిన ఫలితాలపై ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థులు వివరించారు.
ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వ పథకాలు చేరువయ్యాయని, తమ సొంత అనుభవాలను ఇంటర్వ్యూలో వివరించినట్లు ఒక విజేత వివరించారు.ఒక ప్రశ్నకు సమాధానంగా, తెలంగాణలో జరిగిన అభివృద్ధిని, జీడీపీ, జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో సాధించిన పురోగతిని చెబితే, ఇంటర్వ్యూ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసిందని మరొక అభ్యర్థి మంత్రికి తెలిపారు.గతంలో కంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగినట్లు తాము గమనించినట్లు వివరించారు.
మీ గెలుపు ఎంతో మందికి ఆదర్శం…
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్లే, జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఇక్కడి యువత భాగస్వామ్యం పెరుగుతుందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.సివిల్స్ ఫలితాల్లో మహిళలు గతంలో కంటే ఎక్కువ ఫలితాలు సాధించడం మంచి పరిణామం అన్నారు.తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నదని, పోటీ పరీక్షల కోసం కష్టపడుతున్న అభ్యర్థులందరికి మీ విజయం నూతనోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు.
సివిల్స్ విజేతలతో దాదాపు గంట సమయం మాట్లాడిన మంత్రి హరీశ్ రావు, విజేతల కుటుంబ నేపథ్యం, ప్రిపరేషన్ తీరు, ఎదుర్కొన్న సవాళ్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.