న్యూజిలాండ్‌లో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం దక్కింది.న్యూజిలాండ్ హిస్టారికల్ అసోసియేషన్ (ఎన్‌జెడ్‌హెచ్ఏ) ‘‘ శేఖర్ బంద్యోపాధ్యాయ బహుమతి’’(‘Shekhar Bandyopadhyay Prize’)ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఏ రంగంలోనైనా న్యూజిలాండ్‌కు చెందిన వ్యక్తి అత్యుత్తమ చారిత్రాక పరిశోధనను గుర్తించే ప్రతిష్టాత్మక ద్వైవార్షి అవార్డు ఇది.దీనిని రిఫరీడ్ జర్నల్‌లోనూ ప్రచురించనున్నారు.ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రొఫెసర్ శేఖర్ బంద్యోపాధ్యాయ పేరును ఈ అవార్డుకు పెట్టారు. న్యూజిలాండ్ ఇండియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా, విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్‌లో ఆసియన్ హిస్టరీ ప్రొఫెసర్(Director of the New Zealand India Research Institute, Professor of Asian History at Victoria University of Wellington) సహా పలు కీలక హోదాలలో ఆయన పనిచేశారు.
హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీలో అసోసియేట్ డీన్ , డిప్యూటీ డీన్‌గానూ సేవలందించారు.
ఈ ప్రకటనపై శేఖర్ స్పందించారు.తనకు లభించిన గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన సహచరుల నుంచి అలాంటి అవార్డును అందుకోవడం తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు.1992లో విక్టోరియా యూనివర్సిటీలో చేరిన ప్రొఫెసర్ బంద్యాపాధ్యాయ ఏడు పుస్తకాలు రాసి, 14 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.50కి పైగా అధ్యాయాలు, జర్నల్ కథనాలను ప్రచురించారు.ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన రచనలలో కాస్ట్ అండ్ పార్టిషన్ ఇన్ బెంగాల్: ది స్టోరీ ఆఫ్ దళిత్ రెఫ్యూజీస్, 1946-1961 (2022), ఫ్రమ్ ప్లాసీ టు పార్టిషన్ అండ్ ఆఫ్టర్: ఎ హిస్టరీ ఆఫ్ మోడరన్ ఇండియా (2015), కాస్ట్, ప్రొటెస్ట్ అండ్ ఐడెంటిటీ ఇన్ కలోనియల్ ఇండియా (2011) ఉన్నాయి.

భారతదేశంలో వలస పాలన , కులం తదితర అంశాలపై భారతీయ డయాస్పోరాకు అవగాహనను పెంపొందించడంలో శేఖర్ పరిశోధన కీలకపాత్ర పోషించింది.కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్, కలకత్తా యూనివర్సిటీలో చదువుకున్న బంద్యాపాధ్యాయ.చికాగో యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ తదితర అంతర్జాతీయ విద్యాసంస్థలలో విజిటింగ్ ఫెలోషిప్‌లను పొందారు.న్యూజిలాండ్ జర్నల్ ఆఫ్ ఆసియస్ స్టడీస్‌కు సహ వ్యవస్థాపకుడిగానూ వ్యవహరించారు.
ఎన్‌జెడ్ఐఆర్ఐలో తన సేవల ద్వారా భారత్ – న్యూజిలాండ్ విద్యా సంబంధాలను బలోపేతం చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు.