పేదలు సాగు చేసుకుంటున్న భూములపై ప్రభుత్వ పెత్తనం ఏంది? :జి.నాగయ్య,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు

యాదాద్రి జిల్లా:తెలంగాణలో పేదలకు సెంటు భూమి ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వం,రెక్కలు ముక్కలు చేసుకొని 70 ఏండ్ల నుండి పేదలు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా గుంజుకునే ప్రయత్నం మానుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య డిమాండ్ చేశారు.

పచ్చని పంటలు పండుతున్న భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం తీసుకోవడం సిగ్గు చేటన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఎస్.లింగోటం గ్రామంలో పేదలకు ఇచ్చిన భూములను బుధవారం వ్యవసాయ కార్మిక బృందం సందర్శించింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలను అమలు జరపాల్సిన ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా దశబ్దాల క్రితం నుండి పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములను’ల్యాండ్‌ పూలింగ్‌’పేరుతో బలవంతంగా ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం చాలా దారుణమని అన్నారు.

 What Is The Government Ownership Of The Lands Cultivated By The Poor G Nagayya-TeluguStop.com

చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం తాను చేసిన చట్టాలనే ఉల్లంఘించడం అన్యాయమని,రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు.రాష్ట్రంలో 1956 నుండి 2014 వరకు 13.88 లక్షల ఎకరాల భూమిని 22.56 లక్షల మందికి అసైన్డ్‌ చేశారాని, బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,ఓసీలకు ఈ భూములను ఆనాటి ప్రభుత్వాలు పంపిణీ చేశాయని తెలిపారు.ఎస్సీలకు 5.76 లక్షల ఎకరాలు,ఎస్టీలకు 6.73 లక్షల ఎకరాలు పంపిణీ చేశారని ఈ భూముల్లో దాదాపు ఇప్పటికే 2.8లక్షల ఎకరాలను ప్రభుత్వమే అమ్మింది ఆవేదన వ్యక్తం చేశారు.తమ కుటుంబ పోషణ కోసం బ్రతుకుదెరువుకోసం పేదలకు అసైన్డ్‌ చేసిన భూములను ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుంజుకోని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారి ప్లాట్లు చేసి ప్రభుత్వ ఖజానాను నింపుకోవాలనే ప్రయత్నం చేయడం ప్రభుత్వ విధానామా అని ప్రశ్నించారు.అంతేకాక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు తక్కువ ధరలకు భూములను కట్టబెట్టి వారిని కోటీశ్వరులను చేయాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు పట్టణాలకు దగ్గరగా అసైన్డ్‌ అయిన భూముల విలువ విపరీతంగా పెరిగిందని కొన్ని చోట్ల ఎకరాకు కోటి రూపాయలకు పైగా పలుకుతున్నదన్నారు.

అలాంటి భూముల నుండి పేద అసైన్డ్‌దారులను బలవంతంగా బయటకు పంపాలనే ఆలోచన దుర్మార్గమని,ఈ ఆలోచనకు వ్యతిరేకంగా తమ హక్కుల సాధనకు ప్రజలు ఉద్యమాల్లోకి వస్తే చట్ట విరుద్ధంగా వారిపైనే కేసులు పెట్టి నిర్బంధం ప్రయోగించి భూములు లాక్కుంటున్నదని విమర్శించారు.ఇప్పటికీ రాష్ట్రంలో 86వేల ఎకరాల సీలింగ్‌ భూములు అక్రమంగా భూస్వాముల ఆధీనంలోనే ఉన్నాయని,వీటితో పాటు ప్రభుత్వ బంజర్లు,ఫారెస్ట్‌ బంజర్లతో పాటు, ఆక్రమించిన అసైన్డ్‌భూములు కూడా భూస్వాముల ఆధీనంలో ఉన్నాయని వాటి జోలికెళ్ళకుండా పేదలను బెదిరించి వారి జీవనాధారమైన భూములను లాక్కోవడం ఎట్లా కరెక్ట్ అని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పుడు విధానాన్ని విరమించుకుని అసైన్డ్‌ భూములు కలిగినవారికి రక్షణ కల్పించాలని భూస్వాముల దగ్గర గల మిగులు భూములను, అక్రమంగా ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని ఆ భూములను కూడా పేదలకు పంచాలని ప్రభుత్వాన్ని కోరారు.లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ ఎస్.లింగోటం గ్రామానికి చెందిన పేదల భూములను ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.చాలామంది పేదలు ఆ భూముల మీద ఆధారపడి జీవిస్తున్నారని ఇప్పటికైనా ఆ భూముల జోలికి ప్రభుత్వము కానీ, అధికారులు గానీ,రాకూడదని,లేనిచో ప్రజలను సమీకరించి పోరాటాన్ని కొనసాగిస్తామని,ఆ గ్రామ పేదలకు వ్యవసాయ కార్మిక సంఘం అండగా ఉండి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాన్ని విరమించుకునే వరకు పోరాడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రోడ్డ అంజయ్య,మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగాదేవి సైదులు,బొజ్జ బాలయ్య బాధిత రైతులు పిట్టల శంకరమ్మ,పులిగిల్ల రాములు, పిట్టల మల్లయ్య,నకిరేకంటి రేణుక,తూర్పింటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube