ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి రికార్డుల్లోకి ఎక్కారు.ముఖ్య కార్య నిర్వహణాధికారిగా ఆయన గతేడాది 281 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ.21,44,53,58,000) వేతనంగా అందుకున్నారని అల్ఫాబెట్ ప్రకటించింది.తద్వారా ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న అత్యున్నత అధికారుల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు.
ఇది ఆల్ఫాబెట్ ఉద్యోగుల సగటు వేతనానికి 1,085 రెట్లు అని కంపెనీ తెలిపింది.
సుందర్ పిచాయ్ ప్యాకేజీలో ఎక్కువ భాగం స్టాక్ అవార్డుల రూపంలో చెల్లించారు.
అంటే మార్కెట్‌లోని ఆల్ఫాబెట్ షేర్ల హెచ్చుతగ్గులను ఆధారంగా సీఈవో వార్షిక వేతనాన్ని లెక్కిస్తారు.భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ 2015 సంవత్సరం నుంచి గూగుల్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
అయితే గతేడాది చివరిలో ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లు కంపెనీ నుంచి వైదొలగడంతో 2019 డిసెంబర్ 3న ఆల్ఫాబెట్‌కు కూడా పిచాయే సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
దీంతో ఆయన వేతనం ఏడాదికి దాదాపుగా 2 మిలియన్ డాలర్లకు పెరిగింది.2016లో 200 మిలియన్ డాలర్లను స్టాక్ రూపంలో పొందారు.కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆల్ఫాబెట్‌లో ఈ ఏడాది ఉద్యోగాలు, పెట్టుబడి ప్రణాళికల విషయంలో కోత విధిస్తూ సుందర్ పిచాయ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.