ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ( YCP ) ఘోరంగా ఓటమి చెందడంతో ఆ పార్టీ నేతలు పూర్తిగా నిరాశ , నిస్పృహల్లో ఉన్నారు.కొంతమంది నేతలు వివిధ ఆఫర్ లు, కేసుల భయంతో వైసీపీని వీడి టిడిపి ,జనసేన, బిజెపిలలో( TDP, Janasena , BJP ) చేరిపోగా, మరి కొంత మంది అదే బాటలో ఉన్నారు.
ఇక క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఇంకా ఓటమి భారం నుంచి కోలుకోలేదు.గత వైసిపి ప్రభుత్వం లో పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలు అందించిన ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారనే దానిపైన వైసీపీ అధిష్టానం ఇంకా ఆరా తీస్తూనే ఉంది .ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటుంది.ప్రజల్లో వైసిపి పై సానుకూలత ఉన్నా .కొన్ని కొన్ని కారణాలు, పార్టీ నేతలు చేసిన తప్పిదాల కారణంగానే ఎన్నికల ఫలితాలు ఇంత దారుణంగా వెలువడ్డాయనే అంచనాకు వచ్చారు.
ఈ నేపథ్యంలోనే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వైసిపి అధినేత జగన్( jagan ) భావిస్తున్నారు.పార్టీ తరఫున నిర్మాణాత్మకంగా మాట్లాడే నాయకులు, కార్యకర్తలు, నాయకులను కలుపుకుని వెళ్లే వారికే పార్టీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో పార్టీ ప్రక్షాళన చేపట్టేందుకు జగన్ నిర్ణయించుకున్నారు.
గ్రామ, మండల ,రాష్ట్ర స్థాయి లో ఈ ప్రక్షాళన చేపట్టాలని భావిస్తున్నారు.
ఎన్నికల సమయంలో చాలామంది నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎన్నికల కోసం పార్టీ ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా సొంత అవసరాలకు మళ్లించడం, కొంతమంది నాయకులు కూటమి పార్టీలతో కుమ్మక్కు కావడం, ఇలా ఎన్నో కారణాలు ఓటమికి దారితీసాయని అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిల తో పాటు, పార్టీ పదవులలోను భారీగా మార్పు చేర్పులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ మేరకు ఈ మార్పు చేర్పుల ద్వారా , పార్టీ కేడర్ లో ఉత్సాహం పెంచడంతోపాటు, టిడిపి , జనసేన , బిజెపి కూటమి ప్రభుత్వం పైన , ప్రజా సమస్యల పైన పోరాటం చేసేందుకు పూర్తిగా ప్రజలతో మమేకం అయ్యి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారట.