తమిళం, హిందీ వంటి ఇతర భాష చిత్రాలు తెలుగులో డబ్బింగ్ చేసినప్పుడో, లేక తెలుగు భాష రాని నటులు తెలుగు సినిమాల్లో నటించినప్పుడో డబ్బింగ్ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది.ఒకప్పుడు అంటే తెలుగు హీరోయిన్స్ ఉండేవారు కాబట్టి వాళ్ళ పాత్రలకు వాళ్ళే డబ్బింగ్ చెప్పుకునేవారు.
కానీ ఇప్పుడు తెలుగు వాళ్ళ కంటే పరాయి భాషా నటులకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.ఇలియానా, కాజల్, త్రిష, నయనతార వంటి పరభాష నటీమణులని హీరోయిన్స్ గా పెట్టుకుంటున్నారు.
వీరు యాక్టింగ్ లో డిగ్రీలు, పీ.హెచ్.డి చేసినా వాయిస్ అనేది ఆ పాత్రకు మ్యాచ్ అవ్వాలి.లేదంటే సినిమా పులిహోర అయిపోతుంది.బయట వీళ్ళ వాయిస్ వింటే కనుక ఇదేంట్రా బాబు ఇలా ఉంది అని అనిపిస్తుంది.అందుకే వీరికి తెలుగు రాదు కాబట్టే డబ్బింగ్ చెప్పిస్తారు.
చిన్మయి, సౌమ్య శర్మ, హరిత, సింగర్ శ్రావణ భార్గవి, స్వాతి వంటి వాళ్ళు కాజల్, ఇలియానా, సమంత వంటి హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పారు.కొంతమంది హీరోయిన్స్ ఐతే తెలుగు భాష నేర్చుకుని మరీ వారి పాత్రలకు వారే డబ్బింగ్ చెప్పుకుంటున్నారనుకోండి అది వేరే విషయం.
అయితే హీరోయిన్స్ గా ఉంటూనే, తమ సినిమాలకే డబ్బింగ్ ఆర్టిస్ట్ లతో డబ్బింగ్ చెప్పించుకుని, వేరే హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పిన హీరోయిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన చందమామ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.ఈ సినిమా కాజల్ కు బ్రేక్ ఇచ్చింది.ఈ సినిమాలో కాజల్ క్యూట్ నటనకు తోడు వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
ఆ వాయిస్ కి పడిపోని యువకులు ఉండరు.అంతలా కాజల్ యాక్టింగ్ కి ఆ వాయిస్ కరెక్ట్ గా సూటయ్యింది.
మరి ఆ వాయిస్ ఇచ్చింది ఎవరనుకుంటున్నారు ? ఇంకెవరు మన ఛార్మింగ్ హీరోయిన్ ఛార్మి.శ్రీ ఆంజనేయం, గౌరీ, మాస్, అనుకోకుండా ఒకరోజు, లక్ష్మి వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సెట్ చేసుకున్నారు.
మంత్ర, జ్యోతిలక్ష్మి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా నటించి మెప్పించిన ఛార్మి, 2007 లో రిలీజైన చందమామ సినిమాలో కాజల్ కు డబ్బింగ్ చెప్పారు.
కాజల్ కు డబ్బింగ్ చెప్పిన ఛార్మికి శ్రీ ఆంజనేయం సినిమాలో బుల్లితెర యాంకర్ ఉదయభాను డబ్బింగ్ చెప్పారు.పద్దు, శివంగి, ఆడపులి అంటూ ఛార్మికి అద్భుతమైన వాయిస్ ఇచ్చారు ఉదయభాను.ఇక మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగిన సోనాలి బింద్రేకి ఖడ్గం సినిమాలో రమ్యకృష్ణ డబ్బింగ్ చెప్పారు.
అప్పట్లో తన సినిమాలకు ఇతర డబ్బింగ్ ఆర్టిస్ట్ లతో డబ్బింగ్ చెప్పించుకున్న రమ్యకృష్ణ, సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పడం విశేషం.అలానే గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఇషా తల్వార్ పాత్రకు నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పగా, మిర్చి సినిమాలో నదియా పాత్రకు ఒకప్పటి హీరోయిన్ రాశి డబ్బింగ్ చెప్పారు.
టాప్ హీరోయిన్ గా కొనసాగిన గోవా బ్యూటీ ఇలియానాకు, జల్సా సినిమాలో అష్టాచమ్మా స్వాతినే డబ్బింగ్ చెప్పారు.ఇక ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో నటించిన రమ్యకృష్ణ, రోజా, నగ్మా పాత్రలకు డబ్బింగ్ చెప్పిన నటి రోజా రమణి.ఏక కాలంలో ముగ్గురు నటులకి డిఫరెంట్ మాడ్యులేషన్ తో వాయిస్ చెప్పిన ఘనత ఈమెది.ఇక అలనాటి నటి సరిత కూడా కొన్ని సినిమాల్లో నగ్మ, సౌందర్య, సుస్మితాసేన్ వంటి హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పారు.
హీరోయిన్స్ కే కాదు, హీరోలకి కూడా మన హీరోలు డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.అప్పట్లో హీరో రాజశేఖర్ కు సాయికుమారే డబ్బింగ్ చెప్పేవారు.రాజశేఖర్ నటించిన చాలా సినిమాలకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు.ఒకరకంగా రాజశేఖర్ ని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది సాయికుమార్ వాయిసే.రాజశేఖర్ కే కాకుండా, సుమన్ కి కూడా డబ్బింగ్ చెప్పారు.ఈ ఇద్దరికే కాకుండా రజనీకాంత్, విజయ్ కాంత్, అమితాబ్ బచ్చన్, అర్జున్, సురేష్ గోపి, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి హీరోలకి తెలుగు డబ్బింగ్ సినిమాలకి డబ్బింగ్ చెప్పిన ఘనత సాయికుమార్ ది.ఇక జయం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నితిన్ కు ఆ సినిమాలో హీరో శివాజీ డబ్బింగ్ చెప్పారు.ఆ తర్వాత దిల్ సినిమాకు కూడా డబ్బింగ్ చెప్పారు.
ఓకే బంగారం, మహానటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ కు ఓకే బంగారం సినిమాలో ఆ పాత్రకు నానినే డబ్బింగ్ చెప్పారు.మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వేరే హీరోకి డబ్బింగ్ చెప్పారు.
అది కూడా సల్మాన్ ఖాన్ కి.అవును సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ అయిన ప్రేమ్ లీల మూవీకి డబ్బింగ్ చెప్పారు.ఇలా మన హీరోయిన్లు, హీరోలు మిగతా నటులకు డబ్బింగ్ చెప్పారు.