వర్షాకాల పార్లమెంటు సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాలు సజావుగా, ఎటువంటి గొడవలు లేకుండా సాగుతాయని ఎవ్వరూ అనుకోవడంలేదు.
సామాన్య ప్రజలే అనుకోవడంలేదంటే ఇక రాజకీయ నాయకులు ఎందుకు అనుకుంటారు? ఆగస్టు మూడో తేదీ వరకు మాత్రమే సాగే ఈ సమావేశాల్లో రచ్చ…రచ్చ చేయాలని, దుమ్ము దుమారం రేపాలని కాంగ్రెసు నిర్ణయించింది.ప్రతిపక్షాలు చేసే అలజడికి తల్లీకొడుకులే (సోనియాగాంధీ, రాహుల్) నాయకత్వం వహిస్తారు.
ప్రధానంగా కళంకితులుగా ముద్రపడిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, వ్యాపం కుంభకోణం బద్దలైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామాలకు డిమాండ్ చేయాలని, రాజీనామాలు చేయకుంటే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేయాలని కాంగ్రెసు నిర్ణయించింది.సోనియా, రాహుల్ కాంగ్రెసుకు చెందిన నలభైనాలుగు మంది ఎంపీలతో చర్చలు జరిపారు.
కళంకితులను తొలగించాలని కోరుతూ పార్లమెంటు బయట నిరసన కార్యక్రమాలు చేయాలని, ప్లకార్డులు ప్రదర్శించాలని, నోటికి నల్లగుడ్డలు కట్టుకుని మౌన ప్రదర్శనలు మొదలైనవి చేయాలని డిసైడ్ చేశారు.రాజ్యసభలో అధికార పార్టీకి బలం లేదు కాబట్టి కీలక బిల్లులు పాస్ కావాలంటే ప్రతిపక్షాల మద్దతు అవసరం.
అందుకే అక్కడ ప్రభుత్వం ఆటలు సాగనివ్వకూడదని కాంగ్రెసు నిర్ణయించింది.రచ్చ రచ్చ చేయాలన్న కాంగ్రెసు వ్యూహంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘ఎవ్వరూ రాజీనామాలు చేయరు’ అని తేల్చిపారేశారు.
ప్రతి అంశంపై చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామన్నారు.లోక్‌సభలో ప్రభుత్వానికి మంద బలం ఉంది కాబట్టి దానిది పైచేయి అవుతుంది.రాజ్యసభలో అపోజిషన్‌కు బలం ఉంది కాబట్టి దాని హవా సాగుతుంది.