మునుగోడులో ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి.ప్రచారానికి మరికొద్ది రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వేగం పెంచారు.
డబ్బులు, మందు, మాంసం పంచుతూ ప్రచారంలో వేగం పెంచారు.ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా విచ్ఛలవిడిగా డబ్బులు పంచుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీ ఖాతాల నుంచి నియోజకవర్గంలోని వివిధ వ్యక్తులకు భారీ మొత్తంలో డబ్బులు బదిలీ అయినట్లు తెలుస్తోంది.దాదాపు రూ.5.22 కోట్లు బదిలీ అయ్యాయని తెలుస్తోంది.ఈ క్రమంలో రూ.5.22 కోట్లను ఫ్రీజ్ చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే బీజేపీ నేతలతోపాటు ఇతర సంస్థల వ్యక్తుల ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.
దీనిపై టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ గుప్తా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదులో మునుగోడు ఓటర్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని 23 బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, ఖాతాదారుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు వెల్లడించారు.
బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి డబ్బు జమ చేసిన ఖాతాదారులెవరూ తమ కంపెనీల్లో ఎలాంటి లావాదేవీలు లేవని, బయటి వ్యక్తులకు సంస్థలో ఉద్యోగుల పేరిట డబ్బులు జమ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇది పూర్తిగా విరుద్ధమని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే డబ్బులు జమైన వారి ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఖాతాలో డిపాజిట్ అయిన సొమ్మును నగదుగా మార్చి.ఓటర్లను కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని వెల్లడించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించి.కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.