అగ్రరాజ్యంగా, ప్రపంచ పెద్దన్నగా, అత్యంత సంపన్న దేశమైన అమెరికాలో నల్లజాతీయుల పట్ల నేటికీ వివక్ష కొనసాగుతుండటం సిగ్గుచేటు.శతాబ్దాలుగా అమెరికా సమాజంలో భాగమైన నల్లజాతీయులు నేటికీ అక్కడ ద్వీతీయశ్రేణి పౌరులుగా జీవిస్తున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు.
ఇక గతేడాది జరిగిన జార్జి ఫ్లాయిడ్ హత్య అయితే నిలువెత్తు నిదర్శనం.ఫ్లాయిడ్‌ను ఓ తెల్లజాతి పోలీసు కర్కశంగా హతమార్చిన తీరు సమాజాన్ని నివ్వెరపరిచింది.
ఈ ఘటనను యావత్ ప్రపంచం నిరసించింది.న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్, నార్త్ కరోలినా, మిచిగాన్, మేరీలాండ్, లూసియానా, తదితర రాష్టాల్లో నల్లజాతీయులు అధికసంఖ్యలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో నల్లజాతీయులు తలెత్తుకుని నిలబడగలిగే ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.దివంగత అమెరికన్ రచయిత్రి, హక్కుల కార్యకర్త మాయా ఏంజెలో బొమ్మతో కూడిన నాణేల ను విడుదల చేస్తున్నట్లు యూఎస్ మింట్ ప్రకటించింది.
తద్వారా ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా మాయా రికార్డుల్లోకెక్కారు.ఈ నాణెం అమెరికన్ ఉమెన్ క్వార్టర్స్ ప్రోగ్రామ్‌లో భాగమని యూఎస్ మింట్ తెలిపింది.ఏంజెలో తన స్వీయ చరిత్ర.‘‘ఐ నో వై ది కేజ్డ్ బర్డ్ సింగ్స్’’ను ప్రచురించారు.
ఇందులో తనపై జరిగిన అత్యాచారాలు, జాతి వివక్షను ఆమె కళ్లకు కట్టినట్లు వివరించారు.2014లో 86 ఏళ్ల వయసులో ఏంజెలో కన్నుమూశారు.గడిచిన 90 ఏళ్లుగా క్వార్టర్ నాణేల ను జారీ చేస్తూ వస్తున్నారు.ఈ నాణేల కు ఒక వైపున అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, మరొక వైపు డేగను ముద్రిస్తూ వస్తున్నారు.
తాజా క్వార్టర్‌కు సంబంధించి నాణేనికి ఓ వైపున వాషింగ్టన్, మరొవైపు ఏంజెలో వుంటారు.చేతులు చాచిన ఏంజెలో వెనుక ఎగిరే పక్షి, ఉదయించే సూర్యుడు కనిపిస్తారు.వీటిని ఆమె రచనల నుంచి సంగ్రహించారు.
ఏంజెలో తన జీవిత కాలంలో 30కి పైగా గౌరవ డిగ్రీలను అందుకున్నారు.2010లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా ఆమెకు ‘‘ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’ను ప్రదానం చేశారు.2013లో సాహిత్య సంఘానికి చేసిన కృషికి గాను ‘‘లిటరేరియన్ అవార్డు’’ను ఆమె అందుకున్నారు.
.