ఆంధ్రప్రదేశ్ లో కొత్త పరిశ్రమల ఏర్పాటేమోగాని ఉన్నవాటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లీజును …ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు దాదాపు ప్రక్రియను పూర్తి చేసింది .
జెన్కోను నిర్లక్ష్యం చేసి …నష్టాల సాకు చూపి అప్పనంగా ముట్టచెబుతున్న ప్రభుత్వ తీరును కార్మికులు, కృష్ణపట్నం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరు వద్ద సుమారు 1500 వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన మొట్ట మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం….ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుంది.2006లో అప్పటి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో …బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ….2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమైంది.అయితే నష్టాలను సాకుగా చూపి… ఈ విద్యుత్ కేంద్రాన్ని 25 సంవత్సరాలు లీజుకు అప్పగిస్తూ జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.దీంతో జెన్కో ఉద్యోగులు, కార్మికులు లీజును వ్యతిరేకిస్తూ … నిరసనలు చేస్తున్నారు.
మూడో యూనిట్ కూడా అందుబాటులోకి రావడం… 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావడంతో మరి కొందరికి ఉద్యోగాలు దొరుకుతాయని ఆశించిన స్థానికుల ఆనందం ఆవిరైపోయింది.
విద్యుత్ ఉత్పత్తిలో సర్ ఛార్జీలలో వ్యత్యాసాన్ని ప్రధాన కారణంగా చూపుతూ ….
లీజుకు ఇచ్చేందుకు ప్రణాళికలు పూర్తి చేసింది ప్రభుత్వం.కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటుకు లీజుకిస్తున్నట్టు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి….
విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ఉద్యోగులు, భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతమైంది.ఇంతలోనే లీజు ప్రకటనకు అనుగుణంగా టెండర్లకు పిలుపునిచ్చింది ప్రభుత్వం.

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ….నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.ఇక్కడి ఉద్యోగులు విధులు నిర్వహిస్తూనే ఉద్యమాల్లో పాల్గొంటూ నిరసన తెలియజేస్తున్నారు.వీరికి మద్దతుగా గతంలో విద్యుత్ కేంద్రం నెలకొల్పేందుకు తమ జీవనాధారమైన భూములను ముట్టజెప్పిన నాలుగు గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వమంటూ ఉద్యమబాట పట్టారు.