మహారాష్ట్రలో మహావికాశ్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం నెలకొన్న విషయం తెలిసిందే.అయితే మహా సర్కార్ పై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని దేవేంద్ర ఫడ్నవీస్ జోస్యం చెప్పారు.సొంత వైరుద్ధ్యాల కారణంగానే ప్రభుత్వం కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్న మహావికాశ్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఏమీ చేయాల్సిన అవసరం లేదని, ఇక ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై తాము ఆలోచిస్తామని పేర్కొన్నారు.శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం కానీ, ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం కానీ తమకు లేవన్నారు.
ఎంపీ సంజయ్ రౌత్‌తో జరిగిన సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదని, తాము తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కూడా తొందరపడడం లేదని ఫడ్నవీస్ తేల్చి చెప్పారు.అయితే మరోపక్క ఫడ్నవీస్‌తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భేటీ అయిన తరువాత ఫడ్నవీస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
అయితే సంజయ్ రౌత్ మాత్రం రాష్ట్రంలోని సమస్యలపై మాట్లాడేందుకే ఆయనతో భేటీ అయినట్టు తమ మధ్య ఉన్నది సైద్ధాంతిక వైరుధ్యమే తప్ప శత్రుత్వం కాదని రౌత్ స్పష్టం చేశారు.అయితే ఫడ్నవీస్‌ను సామ్నా పత్రిక కోసం ఇంటర్వ్యూ చేయాలని గతంలో అనుకున్నామని, అయితే కరోనా నేపథ్యంలో అది కార్యరూపం దాల్చలేదన్నారు.
అయితే బీహార్ ఎన్నికల తరువాత ఆయన ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పారు అంటూ రౌత్ తెలిపారు.అయితే తమ భేటీ గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కు తెలుసని రౌత్ పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ఉప్పు నిప్పులా ఉంటున్న అధికార శివసేన, ప్రతిపక్ష బీజేపీల ముఖ్య నేతల సమావేశం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ లో దాదాపు రెండు గంటల పాటు వీరి భేటీ సాగింది.
బీజేపీపై సంజయ్ రౌత్ ఇటీవల అనేక అంశాలపై విమర్శలు కూడా చేశారు.అయితే ఇలాంటి సమయంలో వీరిద్దరు భేటీ కావడం మరింత చర్చనీయాంశమైంది.