లేటు వయసులో అమెరికా అధ్యక్ష పగ్గాలు అందుకున్న జో బైడెన్ విమర్శలు వస్తున్నా, వృద్ధాప్య సమస్యలు వేధిస్తున్నా బండి లాక్కొస్తున్నారు.కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసినప్పటికీ.
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, కంపెనీల లే ఆఫ్‌లు ఆయనను భయపెడుతున్నాయి.దీనికి తోడు ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల ఆధిపత్యం మళ్లీ పెరగడం బైడెన్‌కు కొంత ప్రతిబంధకంగా మారాయి.
అయితే సొంత పార్టీ నుంచి ఇంకా ఎలాంటి అసమ్మతి లేకపోవడంతో బైడెన్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.సరిగ్గా ఇదే సమయంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా వున్న సమయం నాటి రహస్య పత్రాలు తాజాగా బయటపడటం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఉక్రెయిన్, ఇరాన్, యూకేలకు చెందిన సున్నితమైన అంశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆ పత్రాల్లో వుందని అమెరికా మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది.
డాక్యుమెంట్లు ఎలా వెలుగులోకి వచ్చాయంటే:
గతేడాది నవంబర్ 2న బైడెన్ పాత కార్యాలయాన్ని మూసివేసేందుకు ఆయన లాయర్ అక్కడికి వెళ్లారు.ఈ క్రమంలో సదరు లాయర్‌కు పర్సనల్ లేబుల్ పేరుతో రహస్య పత్రాలు అని వున్న కవర్ కనిపించింది.దీంతో ఆయన వెంటనే నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారం అందించారు.
ఆ తర్వాత బైడెన్ బృందం కొన్ని బాక్సులను ముందే అక్కడి నుంచి తరలించినట్లుగా తెలుస్తోంది.
అప్పుడే విషయం వెలుగుచూసినప్పటికీ.
ఆ తర్వాత కొద్దిరోజులకే అమెరికా మధ్యంతర ఎన్నికలు వుండటంతో ఈ వ్యవహారాన్ని తొక్కి వుంచారు.మిడ్ టెర్మ్ ఎలక్షన్స్, రీసెంట్‌గా ప్రతినిధుల సభ స్పీకర్ ఎన్నికలు ముగిసిన తర్వాత విషయం గుప్పుమంది.ఈ వార్త అప్పుడే ప్రపంచానికి తెలిసివుంటే డెమొక్రాట్ల పరువు పోవడంతో పాటు ఎన్నికల్లో ఎంతో నష్టం కలిగేది.
ఇప్పుడేం చేస్తారు:
బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు వెలుగుచూడటంతో రిపబ్లికన్లు భగ్గుమంటున్నారు.ఈ వ్యవహారంలో బైడెన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పత్రాలు బయటపడినప్పటికీ విషయాన్ని తొక్కిపట్టారంటూ అమెరికన్ మీడియా, విపక్షం ఆరోపిస్తోంది.
ఇదే సమయంలో అధ్యక్షుడిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే అవకాశాలు వున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించి బంతి అటార్నీ జనరల్ గార్లాండ్ కోర్టులో వుంది.
ఆయన నిర్ణయంపైనే బైడెన్‌పై విచారణ అంశం ఆధారపడి వుంది.అయితే ఈ వ్యవహారంపై అధ్యక్షుడు స్పందించారు.
తన కార్యాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన రహస్య పత్రాలు వున్నాయని తెలిసి ఆశ్చర్యం కలిగిందన్నారు.అవి తన ఆఫీస్‌కు ఎలా చేరాయో తెలియదని బైడెన్ చెప్పారు.
మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో ఎలాంటి కలకలం రేపుతోందో వేచిచూడాలి.