కర్ణాటక సీఎం యడ్యూరప్ప పై బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ్ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.ఆ రాష్ట్ర సీఎం గా యడ్యూరప్ప మరెంతో కాలం కొనసాగలేరు అంటూ బసన్ గౌడ్ పాటిల్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
ఇద్దరూ కూడా ఒకే పార్టీ కి చెందినవారు కావడం తో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.ఇప్పటికే కర్ణాటక సీఎం యడ్యూరప్ప ను కొనసాగించడం పై పలు భిన్న కధనాలు వినిపిస్తున్న ఈ సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యే నే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఉత్తర కర్ణాటక నుంచి బీజేపీ నాయకుడిని తదుపరి సీఎంగా చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని ఆయన బాంబుపేల్చారు.‘బీజేపీ అధిష్టానం సీఎం యడ్యూరప్ప తీరుతో విసుగు చెందింది అని అందుకే రాష్ట్రం త్వరలోనే కొత్త ముఖ్యమంత్రిని చూడబోతోంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.
అంతేకాకుండా ఆయన ఒక్క శివమొగ్గ జిల్లాకు మాత్రమే సీఎంగా పని చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
అయితే ఎప్పుడూ వివాదాస్పద ప్రకటనలు చేసి వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే బసన్‌గౌడ్ పాటిల్ యత్నాల్ ఈ సారి ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే గురిపెట్టడం చర్చకు దారి తీసింది.
సోమవారం రాత్రి ఓ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.యత్నాల్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.
గతంలో కూడా పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడం తో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
అయితే మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఉమేశ్ కట్టి సైతం ఇటీవల ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర కర్ణాటక ప్రజలు ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్నారని, కానీ ఇతర ప్రాంతానికి చెందిన నాయకుల వద్ద తాము మోకరిల్లాల్సి వస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
అయితే ఇక్కడ పరిస్థితిని పార్టీ అధిష్టానం గమనించిందని, ప్రధాని మోడీ ఈ ప్రాంతం నుంచి సీఎం పేరును దాదాపు ఖరారు చేసినట్లే అని కట్టి వ్యాఖ్యలు చేశారు.అయితే కట్టి వ్యాఖ్యలు వివాదాస్పదమైన ఈ సమయంలోనే బసన్ గౌడ్ పాటిల్ యత్నాల్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం.