ప్రత్యర్థుల మీద తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ అస్త్రాలైతే సంధించాడో సరిగ్గా అటువంటి అస్థ్రాలే తిరిగి తిరిగి వచ్చి తమకు తగులుతుండడంతో కేసీఆర్ లో ఆందోళన మొదలయ్యింది.అసలు తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ దరిదాపుల్లోకీ ఏ పార్టీ రాకూడదనే ఆలోచనతో ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న నాయకుల్లో కీలకమైన వారందరికీ గులాభీ కండువా కప్పేశారు.
ఆఖరికి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా చేయడానికి సిఎల్పీని విలీనం చేయటానికి కూడా వెనకాడలేదు.నేను చెప్పిందే తెలంగాణాలో జరగాలి అన్నట్లు కేసీఆర్ వ్యవహరించేవాడు .కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ దూకుడికి కొంచెం బ్రేక్పడింది.ఇదే సమయంలో అసెంబ్లీ లో ఒక్క సీటు మాత్రమే దక్కించుకున్న బీజేపీ లోక్ సభకి వచ్చేసరికి నాలుగు స్థానాలు దక్కించుకుని మరింత బలపడింది.

ఇదే ఊపు ఇక ముందుకు కూడా కొనసాగాలనే నిర్ణయంతో ఉన్న బీజేపీ పెద్దలు.తమ పూర్తి ఫోకస్ అంతా ఇక్కడే పెట్టారు.అంతే కాదు తెలంగాణ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి హోమ్ శాఖ సహాయక మంత్రి పదవి ఇచ్చారు.దీంతో కిషన్ రెడ్డి తెలంగాణాలో దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు.
అలాగే బీజేపీ అగ్ర నేత అమిత్ షా కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టాడు.దీనితో కేసీఆర్ లో అలజడి మరింత తీవ్రం అయ్యింది.
నిన్న మొన్నటి దాక ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు కొంచం అలోచించి అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ టీఆర్ఎస్ క్యాడర్ ఎవరూ బీజేపీ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

పార్టీలో ఎక్కడా అసంతృప్తి చెలరేగకుండా ఎప్పటికప్పుడు అసంతృప్త నాయకులను గుర్తించి వారికి కౌన్సలింగ్ ఇస్తున్నాడు.అలాగే రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు కేసీఆర్.మంత్రి వర్గంలో తమకు స్థానం దక్కుతుందని ఆశించిన వారు అటువంటివి రాకపోవటంతో లోలోపలే కేసీఆర్ మీద వ్యతిరేకతో ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా కేసీఆర్ చెవిన పడింది.
ముఖ్యంగా కరీంనగర్ లో సీనియర్ ఎమ్మెల్యే కమలాకర్ మంత్రిపదవి కోసం చూసి చూసి రాకపోవటంతో నిరాశలో ఉన్నాడు.అదే ప్రాంతంలో బీజేపీ నుండి ఎంపీగా బండి సంజయ్ గెలిచారు.
కిషన్ రెడ్డికి సన్నిహితుడైన బండి సంజయ్ దూకుడుగా ఉండడంతో కమలాకర్ కి మంత్రి పదవి ఇచ్చి కూల్ చేయడంతో పాటు సంజయ్ స్పీడ్ కి బ్రేకులు వేయాలని కేసీఆర్ భావిస్తున్నాడట.