టైమ్ చూసి గట్టి దెబ్బ కొట్టబోతున్నాయి టెలికాం కంపెనీలు.ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటూ ఇన్నాళ్లూ పోటీ పడి డేటా, కాల్స్ అలవాటు చేశాయి.
ఇప్పుడు వాటన్నింటినీ రాబట్టడానికి సిద్ధమవుతున్నాయి.భారీ నష్టాల్లో ఉన్నామంటూ ఒకేసారి 50 శాతం వరకూ చార్జీలు పెంచేస్తున్నాయి.
కస్టమర్ల జేబులకు భారీ బొక్క పెట్టబోతున్నాయి.
వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ చార్జీలు ఈ నెల 3 (మంగళవారం) నుంచి పెరగనుండగా.
జియో కూడా 6వ తేదీ నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.అసలు ఈ జియో వచ్చినప్పటి నుంచే మొబైల్ డేటా చార్జీలు విపరీతంగా తగ్గాయి.
ఏకంగా ఆరు నెలల పాటు ఫ్రీగా అన్‌లిమిటెడ్ 4జీ డేటాను ఇచ్చి కస్టమర్లను బానిసలుగా మార్చేసింది.

ఆ సంస్థను చూసి ఇతర కంపెనీలు కూడా రేట్లు తగ్గించాల్సి వచ్చింది.నష్టాలను భరించలేక కొన్ని కంపెనీలు మూతపడగా.వొడాఫోన్, ఐడియాలాంటి పెద్ద కంపెనీలు ఒకే సంస్థగా మారాల్సి వచ్చింది.
ఇప్పుడా నష్టాలను తగ్గించుకునేందుకు ధరలు పెంచుతున్నారు.దీనికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా అనుమతి ఇచ్చింది.

అన్ని కంపెనీలు అన్‌లిమిటెడ్ కాల్స్‌ను కూడా కత్తిరించనున్నాయి.నిర్దేశిత సమయం తర్వాత నిమిషానికి ఆరు పైసల చార్జీ వసూలు చేయనున్నాయి.వొడాఫోన్ ఐడియా ఏడాదికి రూ.999గా ఉన్న ప్లాన్ ధరను ఇప్పుడు రూ.1499కి పెంచింది.అదే రూ.1699 ప్లాన్ ధర ఇప్పుడు రూ.2399కి చేరింది.ఇది రెండు 365 రోజుల ప్లాన్స్ కాగా.84 రోజుల ప్లాన్ ధర రూ.458 నుంచి రూ.599కి పెరిగింది.28 రోజుల ప్లాన్‌ను రూ.199 నుంచి రూ.249కి పెంచారు.
ఇక ఎయిర్‌టెల్ కూడా దాదాపు ఇలాగే రేట్లు పెంచింది.ఏడాది ప్లాన్ అయిన రూ.998 ధర ఇప్పుడు రూ.1499కి, రూ.1699 ప్లాన్ ధర రూ.2398కి, 84 రోజులు, రోజుకు 1.5 జీబీ డేటా ప్లాన్ అయిన రూ.458ని రూ.598కి పెంచింది.28 రోజుల ప్లాన్ ధర కూడా రూ.199 నుంచి రూ.248కి చేరింది.
జియో కూడా ఆరో తేదీ నుంచి తన ధరలను 40 శాతం వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది.
అయితే ధరలతోపాటు వచ్చే ప్రయోజనాలు కూడా ఇంకా మెరుగ్గా ఉంటాయని సంస్థ చెబుతోంది.