రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ల తనిఖీ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) సంబంధిత అధికారులను ఆదేశించారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు, జిల్లాలోని తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డ్ లోని గౌడౌన్ లో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల మొదటి స్థాయి తనిఖీ ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు.ఈ నెల 5 వ తేదీ నుండి ఈవీఎం ల మొదటి స్థాయి తనిఖీ చేపడుతున్నట్లు వెల్లడించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాల ఆవరణలో ఈవీఎం, వీవీప్యాట్ ల అవగాహన ప్రదర్శన కేంద్రాలు ఏర్పాటు చేసి, అవగాహన కల్పించాలని సూచించారు.ఎన్నికల కోసం కావాల్సిన సామగ్రిని తెప్పించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఓటరు జాబితాను మరోసారి పరిశీలించాలని, డబుల్ ఓట్లు, తప్పులు ఉండకూడదని స్పష్టం చేశారు.బీఎల్ఓ లతో ఇంటింటికీ తిరిగి జాబితాను సిద్దం చేయాలని ఆదేశించారు.
రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఎన్.ఖీమ్యా నాయక్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు ఆనంద్ కుమార్, మధుసూధన్, చీఫ్ ప్లానింగ్ అధికారి పి.బి.శ్రీనివాస చారి, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎన్నికల విభాగం నాయబ్ తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.