పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు అదిగో ఇదిగో అన్నట్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి.ఇటీవల ఈ సినిమా కు సంబంధించిన ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ మూడు నాలుగు రోజుల పాటు జరిగింది.
పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హీరోయిన్స్ అంతా కూడా పాల్గొన్నారు.షెడ్యూల్ వెంటనే ప్రారంభించే అవకాశం ఉందని, అందుకే ఇలా వర్క్ షాప్ నిర్వహించారని అంతా భావించారు.
ఈ దెబ్బతో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా బలంగా నమ్మారు.కానీ ఆ వర్క్ షాప్ పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఏపీకి వెళ్లారు.
అక్కడ వరుసగా జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ మధ్య కాలంలో పూర్తిగా రాజకీయాలకు పవన్ కళ్యాణ్ సమయం కేటాయిస్తున్నారు.
దాంతో ఈ సినిమా షూటింగ్ మళ్లీ గందరగోళంలో పడ్డట్లయ్యింది. వర్క్ షాప్ ముగించి షూటింగ్ వెంటనే ప్రారంభించాల్సి ఉండగా.
పవన్ కళ్యాణ్ లేక పోవడంతో దర్శకుడు క్రిష్ ఏం చేయాలో పాలు పోక జుట్టు పీక్కుంటున్నాడు.ఇప్పటికే చాలా మంది డేట్స్ తీసుకొని ఉన్నాడు.
వారి డేట్ లు ఏం చేసుకోవాలో అర్థం కాక దర్శకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో జాయిన్ అయితే బాగుంటుందంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లకు ఎక్కువ సమయం కేటాయించడం లేదంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అప్పుడప్పుడైనా సినిమా లు చేసి సంవత్సరానికి ఒకటైన ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.