1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను( 1984 Anti-Sikh Riots ) మారణ హోమంగా ప్రకటించాలంటూ కెనడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య( Canada MP Chandra Arya ) వ్యతిరేకించడం కలకలం రేపింది.దీనిపై సిక్కు వేర్పాటు వాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)( Sikhs For Justice ) బెదిరింపులకు దిగింది.
హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన ఏకైక ఎంపీని తానేనని ఆర్య చెప్పిన వెంటనే ఎస్ఎఫ్‌జే నుంచి ఈ బెదిరింపు రావడం గమనార్హం.
తొలి నుంచి కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా బలమైన స్వరం వినిపిస్తున్నారు చంద్ర ఆర్య.
తాజా తీర్మానాన్ని వ్యతిరేకించినందుకు పార్లమెంట్ భవనం వెలుపల కూడా కొందరు తనను బెదిరించారని ఆర్య ఆరోపించారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు చోటు చేసుకున్నాయి.
ఈ ఘర్షణలను మారణహోమంగా ప్రకటించాలని కెనడా పార్లమెంట్‌లో( Canada Parliament ) ఓ ఎంపీ తీర్మానం ప్రవేశపెట్టారు.అయితే దీనిని చంద్ర ఆర్య వ్యతిరేకించారు.
అయితే కెనడాలో హిందూ కమ్యూనిటీ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినందుకు తాను బెదిరింపులను ఎదుర్కొంటున్నానని ఆయన తెలిపారు.ఖలిస్తానీ లాబీ మళ్లీ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించవచ్చని చంద్ర ఆర్య హెచ్చరించారు.హిందూ కెనడియన్ల ఆందోళనను స్వేచ్ఛగా , బహిరంగంగా వినిపించకుండా తనను అడ్డుకోవడానికి పార్లమెంట్ లోపల వెలుపల అనేక ప్రయత్నాలు జరిగాయని ఆయన తెలిపారు.
కొద్దిరోజుల క్రితం కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారని.ఇప్పుడు హిందూ కెనడియన్లను, వారి దేవాలయాలను టార్గెట్ చేశారని చంద్ర ఆర్య చెప్పారు.ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ సభ్యుడికే హాని కలిగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాగా.1984 అక్టోబరు 31న అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని. ఆమె బాడీగార్డులైన సత్వంత్ సింగ్, బీయాంత్ సింగ్ కాల్చి చంపారు.ఇందిర హత్యతో దేశం ఉడికిపోయింది.ఈ హత్యకు ప్రతీకారంగా పలు చోట్ల సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి.దేశ రాజధాని ఢిల్లీతో పాటు చాలా ప్రాంతాల్లో సిక్కులను ఊచకోత కోశారు.
ఆస్తుల ధ్వంసం, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దోపిడిలతో అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి.ఈ అల్లర్లలో దాదాపు 2800 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా.
ఈ సంఖ్య భారీగానే వుంటుందని అంచనా.