తెలంగాణ బీజేపీ లో రోజురోజుకు వర్గ విభేదాలు ముదురుతున్నాయి.మొన్నటివరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వర్గాలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నించినట్టుగా వ్యవహరించాయి.
దీనికి తగ్గట్లుగానే అప్పట్లో ఆ తరహా రాజకీయాలు ఎక్కువగా ఉండేవి. బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో తన మార్క్ ఉండేలా చేయాలని సంజయ్ అభిప్రాయ పడడంతో, పార్టీ అధిష్టానం సైతం ఆయనకు తగిన ప్రోత్సాహం అందిస్తూనే వచ్చింది.
ఇక కొద్ది నెలల క్రితమే టీఆర్ఎస్ నుంచి అవమానకర రీతిలో మంత్రి పదవిని కోల్పోయిన ఈటెల రాజేందర్ పార్టీకి, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెంటనే బీజేపీ లో చేరి పోయారు.అలా చేరిన వెంటనే ఈటెల రాజేందర్ రాజీనామా కూడా ఆమోదం పొందడంతో , ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఇక అప్పటి నుంచి బీజేపీ రాజేందర్ హవా కూడ మొదలైంది.
దీంతో తెలంగాణ బీజేపీలో మూడు గ్రూపులు ఉన్నాయి అనే ప్రచారం ఊపందుకుంది.
రాజేందర్ బీజేపీ విధానం కాకుండా, సొంత అజెండాతో ముందుకు వెళుతున్నారని, పార్టీని బలోపేతం చేయకుండా వ్యక్తిగతంగా తన ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని , గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ లో గుస గుసలు ఎన్నో వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టకుండా పోటీకి దూరంగా ఉంచాలి అని నిర్ణయించింది. కరీంనగర్ లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన టీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ కు ఈటెల రాజేందర్ బహిరంగంగా మద్దతు పలికారు.
అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు.అంతకుముందు బీజేపీ అభ్యర్థులను ఎవరి నిలబెట్టడం లేదని , స్థానిక సంస్థల ఓటర్లు అంతా దూరంగా ఉండాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన కూడా విడుదల చేశారు.
దీనికి భిన్నంగా రాజేందర్ రవీందర్ సింగ్ కు మద్దతు ఇవ్వడం, ముగ్గురు బీజేపీ కార్పొరటర్లు రవీందర్ సింగ్ కు ఓటు వేయడంతో ఆగ్రహించిన బండి సంజయ్ ముగ్గురు కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఎందుకు ఓటింగ్ పాల్గొన్నారని నోటీసులో పేర్కొన్నారు.
అయితే స్వయంగా ఈటెల రాజేందర్ కు మద్దతు ఇవ్వాలని ఓటింగ్ లో పాల్గొనాలని వీడియో సందేశాలు మీడియా ప్రకటనలు ఇచ్చారని, అటువంటి వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యేలకు ఒక న్యాయం కార్పొరేటర్లకు మరో న్యాయమా అంటూ నోటీసులు అందుకున్న వారు గట్టిగానే సమాధానం ఇచ్చారట.

అంతేకాదు రాజేందర్ రవీందర్ సింగ్ కు మద్దతుగా మాట్లాడిన వీడియో సందేశం కూడా అధిష్టానానికి పంపించినట్లు సమాచారం.ఈ వ్యవహారంతో రాజేందర్ బండి సంజయ్ మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి అనే ప్రచారం ఇప్పుడు తెలంగాణ బీజేపీ మొదలైంది.పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన రాజేందర్ కు ఇప్పుడు నోటీసులు ఇస్తారనే ప్రచారం సంజయ్ వర్గీయులు చేస్తుండడంతో, వీరిద్దరి మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్లినట్లు గా కనిపిస్తోంది.
దీనిపై అధిష్టానం పెద్దలు కలుగ చేసుకునే అవకాశం ఉందని ప్రచారం ఇప్పుడు జరుగుతోంది.