తెలుగులో దాదాపుగా కొన్ని వందల కుపైగా చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటుడు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ “చలపతి రావు” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే పాత్ర ఏదైనా సరే చక్కగా ఒదిగిపోయి పాత్రకి తగ్గట్టుగా హావభావాలను పలికిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నటుడు చలపతి రావు మంచి దిట్ట అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా తాజాగా నటుడు చలపతి రావు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని మా అసోసియేషన్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే మా ఎన్నికలను ఏకగ్రీవం చేయడమే మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా మా అసోసియేషన్ కి సొంత బిల్డింగ్ లేదని కానీ ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న హీరో మంచు “విష్ణు” తన సొంత డబ్బులతో మా అసోసియేషన్ కి కొత్త బిల్డింగ్ కట్టిస్తానని చెబుతున్నప్పుడు విష్ణు ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మంచిదని చెప్పుకొచ్చాడు.ఒకవేళ మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత ప్రకాష్ రాజ్ పోటీ చేస్తే అప్పుడు కావాలంటే ప్రకాష్ రాజ్ ని అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చని అలాగే ఎవరైనా సరే మా ఆర్టిస్టుల బాగోగుల కోసమే పోరాడుతారని అలాంటప్పుడు ఎవరు మంచి చేస్తే వారికి పదవిని కట్టబెట్టడంలో తప్పేముందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అలాగే సినిమా పరిశ్రమలో తానెప్పుడూ పారితోషికం విషయంలో దర్శక నిర్మాతల దగ్గర బెట్టు చేయలేదని అందువల్లనే తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని తెలిపాడు.అలా కాకుండా పారితోషికం విషయంలో మరియు అవకాశాల విషయంలో బెట్టు చేసి ఉంటే తాను ప్రస్తుతం కోట్ల రూపాయలకు అధిపతి అయ్యేవాడినని తెలిపాడు.
అంతేకాకుండా ప్రముఖ సీనియర్ స్వర్గీయ నటుడు నందమూరి తారక రామా రావుతో కూడా తనకు అప్పట్లో సన్నిహిత సంబంధాలు ఉండేవని ఆయన పేరు అడ్డం పెట్టుకుని కూడా కోట్లు సంపాదించే వాడినని కానీ తాను ఎప్పుడూ కూడా ఇతరులను కష్ట పెట్టి డబ్బులు సంపాదించాలని అనుకోలేదని అయినప్పటికీ తనకు దేవుడు ఇచ్చిన దాంతో సంతోషంగా బ్రతుకుతున్నానని చెప్పుకొచ్చాడు.