తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ త్వరలోనే గులాబీ కండువా కప్పుకో బోతున్న నేపథ్యంలో, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి.
రమణ ను టిఆర్ఎస్ లోకి అధిక ప్రాధాన్యం ఇచ్చి తీసుకురావడం చాలా మంది నాయకులకు ఇష్టమే లేదు.తెలంగాణకు కెసిఆర్ ఊహించనంత స్థాయిలో రమణ పర్ఫామెన్స్ లేదు అనే వాదన తెరపైకి వచ్చింది.
ఇదిలా ఉంటే రమణ టిడిపికి దూరం అయితే ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రభావం కోల్పోతుంది అనే వాదన ఒక వైపు వస్తుండగా, ఏడేళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేసిన రమణ వల్ల పార్టీకి కలిగిన ప్రయోజనం ఏమీ లేదు అనేది ఆ పార్టీలోని కొంతమంది నాయకుల అభిప్రాయం.
ఏది ఎలా అనుకున్నా, తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.
దీంతో ఎవరు ఆ బాధ్యత తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.అసలు రమణ నాయకత్వాన్ని టిడిపిలో మెజారిటీ నాయకులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
ఆయన పార్టీ బలోపేతానికి ఏ మాత్రం కృషి చేయలేదని, నామమాత్రంగానే ఆ పదవిలో కూర్చున్నారు అనే విషయమూ చర్చకు వస్తోంది.ఇదిలా ఉంటే రమణ స్థానంలో ఆ బాధ్యతలను స్వీకరించే వ్యక్తులుగా సీనియర్ నేతలు నన్నూరి నర్సిరెడ్డి , అరవింద్ కుమార్ గౌడ్ వంటి వారు పేర్లు తెరపైకి వస్తున్నాయి.
అరవింద్ కుమార్ గౌడ్ కంటే మంచి వాక్చాతుర్యం ఉన్న నర్సిరెడ్డి అయితేనే తెలంగాణ టిడిపి బలం పుంజుకోగలదు అనే అభిప్రాయాలు ఆ పార్టీ నాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అదీ కాకుండా నర్సిరెడ్డి పేరును ఎక్కువమంది తెలుగు తమ్ముళ్లు సూచిస్తూ ఉండడం, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తెలంగాణలో కాస్తో కూస్తో ప్రయోజనం ఉంటుందనే లెక్కలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.అది కాకుండా మిగతా పార్టీలు సైతం రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో చంద్రబాబు సైతం నర్సిరెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.