జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెన( Chenab Railway Bridge ) పై మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.ఈ ప్రతిష్టాత్మక వంతెనపై శనివారం తొలిసారిగా వందే భారత్ రైలు ప్రయాణించింది.
ఇందుకు సంబంధించిన వీడియోను భారత రైల్వే శాఖ షేర్ చేయగా, ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ ( Shri Mata Vaishno Devi Railway Station )నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలు ఫస్ట్ ట్రయల్ రన్ నిర్వహించబడింది.
ఈ మార్గంలో చీనాబ్ నది ప్రవహించటం వలన, ఈ రైలు చీనాబ్ వంతెన పై పరుగులు పెట్టింది.కాశ్మీర్‌లోని శీతల వాతావరణాన్ని తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ఈ వంతెన, నీరు గడ్డకట్టకుండా ఉంచేందుకు అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలు అమర్చబడ్డాయి.
ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిన అనంతరం, త్వరలోనే ఈ రైలు తన సేవలను ప్రారంభించనుంది.
కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు 272 కిలోమీటర్ల మేర ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.ప్రాజెక్ట్ దాదాపుగా పూర్తయింది.కేవలం కత్రా-రిసియా మధ్య కొంత మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే రైళ్లు అంజి వంతెన, చీనాబ్ వంతెన మీదుగా ఉధంపూర్, జమ్ము, కత్రా గుండా, శ్రీనగర్ వరకు ప్రయాణిస్తాయి.ఈ మార్గంలో ప్రయాణంతో రోడ్డు మార్గంతో పోలిస్తే ఆరు గంటల సమయం ఆదా అవుతుంది.
చీనాబ్ రైల్వే వంతెన విశేషాలు చూస్తే.చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మితమైంది.ఈ మొత్తం పొడవు 1,315 మీటర్లు.ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన, చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మితమైన 275 మీటర్ల ఎత్తైన షుబాయ్ రైల్వే వంతెనను అధిగమించింది.
ఈ వంతెన ఎత్తు పారిస్‌లోని ఐఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువ.ఇక భారతీయ రైల్వే తీసుకున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చీనాబ్ వంతెనపై వందే భారత్ రైలు పరుగులు తీయడం దేశం గర్వించదగిన ఘట్టంగా అభివర్ణిస్తున్నారు.చీనాబ్ రైల్వే వంతెన, భారతీయ రైల్వే ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే ఉదాహరణ.
ఇది కేవలం భారతీయ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని కాకుండా, కశ్మీర్ లోయను మిగతా భారతంతో అనుసంధానించే గొప్ప ప్రయత్నానికి ప్రతీకగా నిలుస్తోంది.భారత రైల్వే విజయోత్సవానికి ఇది మరో ఆభరణంగా నిలిచింది.