కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ వణికిపోతోన్న సంగతి తెలిసిందే.గడిచిన కొద్దిరోజుల నుంచి దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు మించి కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఎవరూ తమ దేశానికి రాకుండా ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.ఇండియా నుంచి వచ్చే విమానాల రాకపోకలపై బ్రిటన్, న్యూజిలాండ్, కెనడా, యూఈఏ, అమెరికా వంటి దేశాలు నిషేధం విధించాయి.
అయితే ఆస్ట్రేలియా మాత్రం అన్ని దేశాల కంటే కాస్త కఠినంగా వ్యవహరించింది.మే 15 వరకు భారత విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ గత మంగళవారం ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రయాణం ప్రమాదకరమని, ఐపీఎల్‌లో వున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, పౌరులు తక్షణమే స్వదేశానికి చేరుకోవాలని ఆయన సూచించారు.అక్కడి వరకు బాగానే వుంది కానీ.
నిషేధాన్ని భారతీయులతో పాటు స్వదేశీయులు ఉల్లంఘంచినా ఐదేళ్లు జైలు శిక్ష, 66 వేల ఆస్ట్రేలియా డాలర్లు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.అయితే ప్రధాని నిర్ణయంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్‌లో క్లిష్ట పరిస్థితుల మధ్య వున్న ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేయాలేకాని బెదిరించడం ఏంటని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ నిర్ణయం పట్ల అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి.
నీకెంత ధైర్యం.నీ చేతులకు రక్తం అంటుకుంది అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని మారిసన్ స్పందించారు.భా రత్ నుంచి వచ్చే తమ ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఆస్ట్రేలియా ప్రధాని సమర్థించుకున్నారు.
దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.ఆస్ట్రేలియాలో థర్డ్ వేవ్ విజృంభణ రాకుండా నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారిసన్ వెల్లడించారు.

అంతేకాకుండా దేశంలో క్వారంటైన్ కేంద్రాలను, పరీక్షల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని పేర్కొన్నారు.అయితే ముందస్తుగా నమోదు చేసుకున్న 20 వేల మంది ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తీసుకువచ్చామని ఆయన గుర్తుచేశారు.నిషేధంపై వస్తోన్న విమర్శలపై స్పందించిన మారిసన్.దేశంలో బయోసెక్యూరిటీ యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్కరినీ జైల్లో వేయలేదన్నారు.ప్రస్తుతం ఇండియాలో 9 వేల మంది వరకూ ఆస్ట్రేలియన్లు ఉన్నారు.అందులో ఐపీఎల్‌లో ఆడుతున్న ప్రముఖ క్రికెటర్లు, కామెంటేటర్లు కూడా ఉండటం గమనార్హం.
మే 15 తర్వాత భారత్‌లో చిక్కుకుపోయిన ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు మారిసన్ స్పష్టం చేశారు.