దేశీయ కార్పొరేట్ రంగంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.పారిశ్రామిక దిగ్గజాలు ఒక్కొక్కరుగా తమ పదవుల నుంచి వైదొలుగుతున్నారు.
కొద్ది రోజుల కిందట హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్మన్ పదవి నుంచి ఆ సంస్థ వ్యవస్ధాపకుడు శివ్ నాడార్ తప్పుకున్నారు.తాజాగా బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ రాహుల్ బజాజ్ తన హోదా నుంచి వైదొలగనున్నారు.
ఈ నెల 31వ తేదీ వరకు బజాజ్ ఫైనాన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు.
రాహుల్ బజాజ్ వైదొలగిన అనంతరం ఆయన కుమారుడు సంజీవ్ బజాజ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది.
సంజీవ్ బజాజ్ ప్రస్తుతం ఫైనాన్స్ సంస్ధకు వైస్ చైర్మన్‌గా పని చేస్తున్నారు.అయితే బజాజ్ అలియాంజ్ జీవిత బీమా, బజాజ్ అలియాంజ్ సాధారణ బీమా కంపెనీకి 2013 నుంచే చైర్మన్ గా కొనసాగుతున్నారు.
1987లో ఏర్పాటైన బజాజ్ ఫైనాన్స్ సంస్థకు నాటి నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న రాహుల్ బజాజ్ 2020 జూలై 31న పదవి నుంచి దిగిపోనున్నారని సంస్ధ తెలిపింది.అయితే నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతారని వెల్లడించింది.
ఆగస్టు 1వ తేదీ నుంచి సంస్థ చైర్మన్‌గా సంజీవ్ బజాజ్ బాధ్యతలను స్వీకరిస్తారని స్పష్టం చేసింది.
తమ సంస్థను రాహుల్ బజాజ్ అత్యుత్తమ స్ధాయికి తీసుకొచ్చారని సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు తెలిపారు.
మరోవైపు సంజీవ్ బజాజ్‌కు చైర్మన్‌గా నియమించడానికి అవసరమైన ప్రతిపాదనలపై ఏకగ్రీవంగా ఆమోదించినట్లు డైరెక్టర్లు స్పష్టం చేశారు.మరోవైపు రాహుల్ బజాజ్ చైర్మన్ పదవి నుంచి దిగిపోతున్నారని తెలియడంతో ఆ కంపెనీ షేర్ల ధర ఒక్కసారిగా 6.43% తగ్గిపోయింది.