తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టి విస్తృతంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.బిజెపిని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయడమే కాకుండా, తెలంగాణలోని బిజెపికి అధికారం దక్కకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలను, బిజెపి వ్యతిరేక పార్టీలను కలుస్తూ మూడో ప్రత్యామ్నాయ కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు.దీనికి తోడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలను పాటిస్తూ జాతి స్థాయిలో కొత్త పార్టీని పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా బిజెపి అగ్ర నేతలపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు.అయితే చాలాకాలంగా కేసీఆర్ విషయంలో సైలెంట్ గానే ఉంటూ వచ్చిన బిజెపి అగ్ర నాయకులు ఇప్పుడు మాత్రం తమ ప్రతాపాన్ని కెసిఆర్ పై కాకుండా కెసిఆర్ వారసులు కేటీఆర్, కవితపై చూపిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.
తాజాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పేరు తెర పైకి రావడం , దీనికి సంబంధించిన పక్కా ఆధారాలను బిజెపి సిద్ధం చేసుకోవడం వంటివి చూస్తుంటే, చాలా కాలంగానే కేసీఆర్ కుటుంబ సభ్యుల వ్యవహారాలపై బీజేపీ ఫోకస్ పెట్టి సరైన సందర్భంలో ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల హడావిడిలో అన్ని పార్టీలు ఉండగా, ఇప్పుడు కవిత అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తేవడం ద్వారా జాతీయస్థాయిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చినట్లు అవుతుందనే ఉద్దేశంతో పాటు, మునుగోడు లోను ఈ అంశాలను ప్రస్తావించి రాజకీయంగా టిఆర్ఎస్ కు ఇబ్బందులు సృష్టించవచ్చనే ఎత్తుగడకు బిజెపి దిగినట్టుగా కనిపిస్తోంది.

ఇక రానున్న రోజుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కేసీఆర్, కేటీఆర్, కవితలతో పాటు, టిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న వారిని టార్గెట్ చేసుకుంటారని, దానిలో భాగంగానే ముందుగా కవిత వ్యవహారం తెరపైకి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.తెలంగాణలో గత కొద్ది రోజులుగా బడా రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.వాసవి గ్రూప్, ఫినిక్స్ గ్రూప్ వంటి వాటిని టార్గెట్ చేసుకున్నారు.ఇవన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాయి .ఈ సంస్థలతో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయనే ప్రచారం తెరపైకి రావడంతోనే ఈ సంస్థలపై దాడులు జరిగినట్లుగా రాజకీయ వర్గాల్లో అనుమానాలు ఉన్నాయి.మరోపక్క ఈడి కూడా వేగం పెంచేందుకు సిద్ధమవుతుండడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే టెన్షన్ టిఆర్ఎస్ అగ్ర నాయకుల్లో నెలకొంది.
బిజెపితో యుద్ధం అంటే ఆశ్రమాషీగా ఉండదనే విషయం కేసిఆర్ కు తెలిసినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బిజెపి పై పోరాటం చేసే విషయంలో వెనక్కి తగ్గితే పూర్తిగా మునిగి పోవాల్సి వస్తుందనే భయం కెసిఆర్ ను వెంటాడుతోంది.