విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది బలిదానాలతో ఎన్నో సంవత్సరాల ఉద్యమం ఫలితంగా అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కలని ఉత్తరాంధ్ర ప్రజలు నెరవేర్చుకున్నారు.ప్రస్తుతం విశాఖ సిగలో స్టీల్ ప్లాంట్ అనేది ఒక మణిహారంగా ఉంది.
ఈ స్టీల్ ప్లాంట్ కారణంగా విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది.ఇప్పటికి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అక్కడి ప్రజలు, నాయకులు ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు.
అయితే అలాంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ఇప్పుడు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.ఎప్పటి నుంచో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో బలంగా ఉంది.
అయితే దీనిపై ఏ ఒక్క రాజకీయ పార్టీ కేంద్రంపై ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు.దీంతో కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ సమావేశాలలో ఏకంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతుందని స్పష్టం చేశారు.

ఈ నేపధ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఏకమవుతున్నారు.ఇక ప్రధాన పార్టీలు అన్ని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఒక్క అధికార వైసీపీ పార్టీ తప్ప అన్ని పార్టీలు బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి.ఈ నేపధ్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు కూడా ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధం అవుతున్నారు.
కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే మరోసారి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఉత్తరాంధ్ర కేంద్రంగా ఉన్న బీజేపీతో సహా అన్ని పార్టీల నాయకులు ఏకమైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఇక కేంద్రం నిర్ణయంపై ఏపీలో బీజేపీతో కలిసి నడుస్తున్న జనసేన పార్టీ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది.ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు.విశాఖ ఉక్కు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేసిన ఉత్తరాంధ్రలో మరోసారి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమానికి ఊపిరి పోసినట్లు అవుతుందని అన్నారు.
అయితే వైసీపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇప్పటి వరకు తమ అభిప్రాయం ఏంటనేది చెప్పలేదు.ఏది ఏమైనా ఏపీలో ఎదగాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ సర్కార్ తన నిర్ణయాలతో పార్టీపై తెలుగు ప్రజలలో మరింత వ్యతిరేకత పెరిగేలా చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.