కొత్తగా పార్టీ పెట్టి .తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయం ప్రస్థానం అనేక అనుమానాలకు తావిస్తోంది.
సొంతంగా పార్టీ పెట్టిన షర్మిల దాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, తెలంగాణలో అధికార పార్టీ గా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ మేరకు తగిన ప్రణాళికలు రూపొందించుకున్నారు.
ప్రస్తుతం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న షర్మిల అనేక ప్రాంతాలకి వెళ్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు .తెలంగాణ అంతట పాదయాత్ర నిర్వహించి, తెలంగాణ ప్రజల్లో తమకు, పార్టీకి ఆదరణ పెరిగేలా చేసుకోవాలని చూస్తున్నారు.ఈ మేరకు ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బృందంలోని ప్రియ అనే ఆమెను వ్యూహకర్తగా షర్మిల నియమించుకున్నారు.
సోషల్ మీడియా తో పాటు , పార్టీ కి ప్రజల్లో ఆదరణ పెంచుకునేలా, ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలు చేర్చుకునే వ్యూహాలు అన్నిటినీ పక్కాగా అమలు చేసి, బలమైన పార్టీగా తీర్చిదిద్దాలని చూస్తున్నారు.
అయితే షర్మిల భావిస్తున్నట్లు గా పార్టీలో పెద్దగా చేరికలు లేకపోవడం, ఎక్కడా సభలు, సమావేశాలు నిర్వహించినా, జనాలు అంతంతమాత్రంగానే హాజరవడం , ఇలా ఎన్నో అంశాలు షర్మిలకు ఇబ్బందికరంగా మారాయి.ఇతర పార్టీల నాయకులు మొదట్లో షర్మిల పార్టీ వైపు చూసినా, ఆ పార్టీకి పెద్దగా ఆదరణ ఉండదు అని, ఆ పార్టీలో చేరినా, ఆర్థికంగానూ, రాజకీయంగాను తాము తీవ్రంగా నష్టపోతామనే ఉద్దేశంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.

ఇక తాను తెలంగాణ బిడ్డను అంటూ షర్మిల పదేపదే చెబుతున్నా, జనాలు మాత్రం ఆమె ఆంధ్రప్రాంత వ్యక్తి అన్నట్టుగా చూస్తుండడం షర్మిల రాజకీయానికి ఇబ్బందికరంగా మారింది.ఇతర పార్టీల్లో చేరేందుకు అవకాశం లేనివారు మాత్రమే, రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు షర్మిల పార్టీ వైపు చూస్తున్నారు తప్ప, మిగతా వారు ఎవరు వైఎస్ఆర్ టీపీని పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండడం షర్మిలకు ఆందోళన పెంచుతుంది.తాను పార్టీ పెట్టగానే పెద్దఎత్తున ఇతర పార్టీల్లోని నేతలు చేరుతారు అని, రాజశేఖర్ రెడ్డి అండతో రాజకీయ జీవితం ప్రారంభించిన వారు తమ పార్టీ వైపు వస్తారని షర్మిల ఊహించినా, పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో షర్మిల కూడా కాస్త టెన్షన్ పడుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.