ఏపీజే అబ్దుల్ కలాం( APJ Abdul Kalam ) తనకు బహుమతిగా ఇచ్చిన గ్రైండర్ కోసం డబ్బులు ఎలా చెల్లించారో తాజాగా IAS అధికారి ఎం.వి రావు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
భారత మాజీ రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం నిజాయితీ, చిత్తశుద్ధి, విలువలు గలవారు.గొప్ప వ్యక్తిత్వానికి ఆయన ఒక ఉదాహరణ.2014లో జరిగిన ఒక సంఘటన తెలిస్తే దైనందిన జీవితంలో అతను ఎంత నిజాయితీగా బతుకుతారో అర్థమవుతుంది.ఐఏఎస్ అధికారి షేర్ చేసిన పోస్ట్ ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.కిచెన్ అప్లియన్సెస్( Kitchen Appliances ) తయారు చేసే సౌభాగ్య వెట్ గ్రైండర్ అనే సంస్థ స్పాన్సర్ చేసిన ఓ కార్యక్రమంలో కలాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఆ సందర్భంగా కంపెనీ అతనికి బహుమతిగా గ్రైండర్ ( Grinder )అందించింది, కానీ కలాం దానిని తీసుకునేందుకు నిరాకరించారు.తన అధికారిక పనికి సంబంధం లేని బహుమతులు తీసుకోనని చెప్పారు.
స్పాన్సర్ గ్రైండర్ తీసుకోవాలని పట్టుబట్టారు.దాంతో అబ్దుల్ కలాం ఏం మాట్లాడకుండా ఆ గ్రైండర్ తీసుకున్నారు.
అయితే మరుసటి రోజు గ్రైండర్ కోసం డబ్బు చెల్లించేందుకు మార్కెట్ ధరను తన అసిస్టెంట్ ద్వారా కనుక్కున్నారు.ఆ మొత్తాన్ని కంపెనీకి చెక్కు రూపంలో పంపారు.
బహుమతి అని చెప్పి చెక్కును డిపాజిట్ చేసేందుకు కంపెనీ నిరాకరించింది.
కలాం చెక్కు డిపాజిట్ అయిందో లేదో బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకున్నారు.తర్వాత కంపెనీ డిపాజిట్ చేయలేదని అర్థం చేసుకున్నారు.దానిని జమ చేయకుంటే గ్రైండర్‌ను వెనక్కి పంపిస్తానని కంపెనీకి ఫోన్ చేసి చెప్పారు.
ఆ కంపెనీ చివరికి చేసేదేమీ లేక కలాం చెక్కును డిపాజిట్ చేసింది.ఈ ఘటనతో ప్రలోభాలకు గురైనా నిజాయితీగా, చిత్తశుద్ధితో జీవించడం సాధ్యమేనని కలాం నిరూపించారు.
అలానే ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.కలాం చర్యలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి.
ఈ కథనాన్ని పంచుకున్న ఐఎఎస్ అధికారి ప్రజా జీవితంలో నైతికత ప్రాముఖ్యతను గుర్తుచేశారు.కలాం ఆదర్శాన్ని ప్రభుత్వ అధికారులందరూ అనుసరించాలన్నారు.