ఇప్పుడు కాకపోతే మరి కొద్ది నెలల్లో అయినా, తెలంగాణ సీఎం గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారు అనడంలో సందేహమే లేదు.అసలు ఎప్పుడు ఆయనకు పట్టాభిషేకం చేస్తారని అంతా ఆసక్తిగా చూస్తున్న, ఎప్పుడూ ఏదో ఒక ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ తతంగం పూర్తి చేద్దామని కేసీఆర్ భావిస్తూ వస్తుండడంతో, అలా వాయిదా పడుతూ వస్తోంది.కేటీఆర్ సీఎంగా బాధ్యతలు అప్పగించిన తర్వాత పూర్తిగా పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలి అనేది కెసిఆర్ అభిప్రాయం.2014 నుంచి టిఆర్ఎస్ కు ఎదురే లేకుండా ఉండడం , ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణలో బలహీనం కావడం ఇవన్నీ టిఆర్ఎస్ కు కలిసి వచ్చాయి.కానీ అకస్మాత్తుగా బిజెపి బలమైన శత్రువు గా మారడంతో కెసిఆర్ సైతం ఇప్పుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని చూస్తున్న కెసిఆర్ కు ఈ పరిణామాలన్నీ ఇబ్బందికరంగా మారాయి.
ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా తెలంగాణ సీఎంగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించ బోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారం అంతా ఎక్క డో బయట నుంచి వస్తే ఎవరు పెద్దగా పట్టించుకునే వారు కాదు.
కానీ టిఆర్ఎస్ కు చెందిన మంత్రులు… కీలక నాయకులు పదే పదే కేటీఆర్ సీఎం కాబోతున్నారని, మార్చిలోనే ఆయనకు పట్టాభిషేకం ఉంటుందని హడావుడి చేస్తుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.అసలు టిఆర్ఎస్ అధిష్టానం అనుమతి లేకుండా మంత్రులు కీలక నాయకులు కేటీఆర్ సీఎం అనే నినాదాన్ని ఎత్తుకోవడం , ఎవరు అడిగినా అడగకపోయినా పదేపదే ఇదే నినాదాన్ని ప్రస్తావిస్తున్న తీరు చూస్తుంటే, వ్యూహాత్మకంగానే కెసిఆర్ ఈ ప్రచారానికి తెర తీసినట్లు కనిపిస్తోంది.

కేటీఆర్ ఇప్పటికే అన్ని రకాలుగానూ తనను తాను నిరూపించుకున్నారని , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారని ఆయనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా పరిపాలన చేయగలరని పదే పదే ప్రస్తావిస్తున్నారు.క్రమక్రమంగా ఈ డిమాండును మరింతగా పెంచి అప్పుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.అప్పటి వరకు హైప్ క్రియేట్ చేసే బాధ్యతను పార్టీ కీలక నాయకులకు కేసీఆర్ అప్పగించినట్లు గా వ్యవహారం కనిపిస్తోంది.