ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా పాపులర్ అయిన పేర్లలో రన్యారావు( Ranya Rao ) కూడా ఒకరు.స్మగ్లింగ్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ ఊహించని షాక్ ఇచ్చారు.
తాను బంగారం అక్రమ రవాణా చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు.అధికారులే తెల్ల పేపర్లపై గోల్డ్ స్మగ్లింగ్ ( Gold smuggling )చేసినట్టు సంతకం చేయించారంటూ రన్యా రావు బాంబు పేల్చడం గమనార్హం.
డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ కు రన్యా రావు లేఖ రాశారు.వాస్తవానికి రన్యా రావు 17 కోట్ల రూపాయల విలువైన బంగారంతో ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డారు.
విచారణలో భాగంగా తాను స్మగ్లింగ్ చేయడం నిజమేనని ఆమె అంగీకరించారు.ఇంతలో ఆమె ప్లేట్ ఫిరాయించడంతో పాటు అరెస్ట్ చేసిన అధికారులపైనే ఆరోపణలు చేయడం ద్వారా రన్యా రావు వార్తల్లో నిలిచారు.

తాను ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదని కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారని ఆమె పేర్కొన్నారు.పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి నాకు నరకం చూపించారని స్మగ్లింగ్ చేసినట్లు ఒప్పుకోవాలని నాపై ఒత్తిడి చేశారని రన్యా రావు అన్నారు.15సార్లు నా చెంప పగులగొట్టారని బలవంతంగా సంతకాలు చేయించారని ఆమె తెలిపారు.నాపై దాడి చేసిన అధికారులను సైతం తాను గుర్తు పడతానని రన్యా రావు వెల్లడించారు.

శారీరక హింస, మానసిక ఒత్తిడిని నేను తట్టుకోలేకపోయానని ఆమె పేర్కొన్నారు.ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరిపించి నాకు న్యాయం చేయాలని రన్యా రావు పేర్కొన్నారు.రన్యా రావు కస్టడీలో ఉన్న ఫోటో కూడా ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.ఆ ఫోటోలో ఆమె చర్మం కమిలిపోయి ఉండటం గమనార్హం.రాబోయే రోజుల్లో రన్యా రావు ఈ కేసు నుంచి బయటపడతారో లేదో చూడాల్సి ఉంది.