జనసేన పార్టీలో కీలక పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం తిరుపతి ఎన్నికల హడావుడి మాత్రమే కాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంతో పాటు, 2022 లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది.
అంతే కాదు కేంద్రం ఈ దిశగా కసరత్తు చేయడం, జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో కీలక పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.ప్రస్తుతం చూస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లలో బిజీ అయిపోయారు.
జనసేనకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు పవన్ సినిమాలు చేసేందుకు మళ్లీ అంగీకరించి షూటింగ్ లలో పాల్గొంటున్నారు.అయితే కరోనా ప్రభావం లేకపోయి ఉంటే, చాలా వరకు సినిమా షూటింగులు జరిగి ఉండేవి.
కానీ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడటంతో ఇప్పుడు వరుసగా షూటింగ్ లలో పవన్ పాల్గొనాల్సి వస్తుంది.
ఇంతటి కీలకమైన సమయంలో పార్టీపై దృష్టి పెట్టకపోతే రానున్న రోజుల్లో జనసేన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఉన్నారు.
ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ ఇప్పుడు బాగా యాక్టివ్ అయ్యారు.తూర్పుగోదావరి జిల్లాలోని దివీస్ పరిశ్రమ వ్యవహారం లో పెద్ద వివాదం చోటు చేసుకుంటున్న తరుణంలో ఆ వ్యవహారంపై జనసేన పార్టీ పోరాడాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు పవన్ లేకుండానే నాదెండ్ల మనోహర్ ఈ వ్యవహారంపై ప్రకటన చేశారు.దివీస్ సంస్థకు పది రోజుల సమయం ఇస్తున్నామని, సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా పవన్ రంగంలోకి దిగుతారు అంటూ ప్రకటించేశారు.

ఎప్పుడు ఏ సమస్యపైన స్పందించాలన్నా, ఉద్యమం మొదలు పెట్టాలన్నా, పవన్ కళ్యాణ్ మాత్రమే స్పందిస్తూ వచ్చేవారు.కానీ దానికి భిన్నంగా ఇప్పుడు నాదెండ్ల స్పందించడం, ఇంకా రానున్న రోజుల్లో ఆయన పార్టీలో యాక్టివ్ గా వివిధ అంశాలపై స్పందిస్తారనే విధంగా జనసేన ఉండడంతో పూర్తిగా నాదెండ్ల రాజకీయం మొదలయినట్టుగా కనిపిస్తోంది.