మెరుగైన జీవితం కోసమో, కుటుంబ ఆర్ధిక పరిస్ధితుల వల్లనో లక్షలాది మంది భారతీయులు పొట్ట చేతపట్టుకుని వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.అయితే అపారమైన ప్రతిభా పాటవాలతో పాటు శ్రమించే గుణం కారణంగా భారతీయులు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
ఇది ఆయా దేశాల్లోని స్థానికులకు కంటగింపుగా మారింది.ఎక్కడి నుంచో వచ్చి తమ అవకాశాలను కొల్లగొడుతున్నారనే అక్కసుతో జాతి, వర్ణ వివక్షను చూపుతూ భారతీయులను మానసికంగా కృంగదీస్తున్నారు.
ఇక హత్యలు, భౌతిక దాడుల సంగతి సరేసరి.నిత్యం ప్రపంచంలోని ఏదో ఒక మూల భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
భారతీయులే కాదు.మిగిలిన దేశాలకు చెందిన ప్రజలు కూడా వలస వెళ్లిన ప్రాంతంలోని స్థానికులకు లక్ష్యంగా మారుతున్నారు.
అసలు సంగతిలోకి వెళితే.భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.కెనడాకు దగ్గరవుతున్నారు.
ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.అయితే భారతీయుల ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు విద్వేషంతో రగిలిపోతున్నారు.
భారతీయులు, భారత సంతతి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు.తాజాగా భారత జాతిపిత మహాత్మా గాంధీ పట్ల కొందరు దుండగులు అవమానకరంగా ప్రవర్తించారు.రిచ్‌మండ్ హిల్ నగరంలోని విష్ణు దేవాలయం ఆవరణలో వున్న బాపూజీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.అంతేకాకుండా విగ్రహం చుట్టూ అసభ్యకరమైన పదాలను రాశారు.
ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది.ఈ మేరకు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఓ ట్వీట్ చేసింది.
గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని.ఈ చర్య కెనడాలో స్థిరపడ్డ లక్షలాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంది.

అటు రాజధాని ఒట్టావాలోని ఇండియన్ హైకమీషన్ కూడా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఈ ఘటన వల్ల కెనడాలో స్థిరపడిన భారతీయులు ఆందోళనకు గురయ్యారని వ్యాఖ్యానించింది.ఈ నేరానికి బాధ్యులైన వారిని పట్టుకుని న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని కోరినట్లు భారత హైకమీషన్ తెలిపింది.దీనిని కెనడా పోలీస్ యంత్రాంగం కూడా తీవ్రంగా పరిగణించింది.
ఏ రూపంలోనూ ద్వేషపూరిత నేరాలను సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.