తెలంగాణలో వరుసగా వస్తున్న ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాల్ గా మారాయి.మొన్నటి వరకు విజయంపై ధీమా బాగానే ఉన్నా , మారిన పరిస్థితుల నేపధ్యంలో గెలుపు పై టిఆర్ఎస్ కు సందేహాలు మొదలయ్యాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత విజయం సొంతం చేసుకున్నారు.అయితే మెజారిటీ స్థానిక సంస్థల ఓటర్లు టిఆర్ఎస్ కు చెందిన వారు కావడంతో, గెలుపు పెద్దగా కిక్ ఇవ్వలేదు.
కానీ దుబ్బాక నియోజక వర్గంలో ఎమ్మెల్యే గా పనిచేస్తున్న సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో, అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత ను రంగంలోకి దింపింది.
ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని రంగంలోకి దింపారు.అలాగే బీజేపీ తరపున రఘునందన్ రావు పోటీలో ఉన్నారు.
అయితే గెలుపుపై ఇప్పుడు టిఆర్ఎస్ లో అనుమానాలు మొదలయ్యాయి.అనేక సర్వేలు చేయడంతో, ఆ ఫలితాలను విశ్లేషించుకుంటే, టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే విధంగా బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్నాయని, విజయం నల్లేరు మీద నడక కాదు అనే విషయాన్ని తేటతెల్లం చేయడంతో టీఆర్ఎస్ ఆందోళనలో ఉంది.
ఇక్కడ గెలుపు కనుక కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి దక్కినా, ఆ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పని సరిగా పడుతుందని, టిఆర్ఎస్ టెన్షన్ పడుతుంది.ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాధ్యతలు మొత్తం హరీష్ రావుకు అప్పగించడం తో, ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మొత్తం హరీష్ రావు భుజాన వేసుకున్నారు.ఇది ఆయన పనితీరుకు నిదర్శనం కావడంతోపాటు, రాబోయే రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది కావడంతో, హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా ఎన్నికల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు వస్తే ఇక్కడ కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది.150 డివిజన్లలో కనీసం వందకు పైగా స్థానాలను దక్కించుకోవాలని టీఆర్ఎస్ చూస్తోంది.2016 లో జరిగిన గ్రేటర్ ఎన్నికలు టిఆర్ఎస్ కు 99 స్థానాలు దక్కే విధంగా కేటీఆర్ వ్యూహరచన చేసి సక్సెస్ అయ్యారు.ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉండడంతో, వందకు పైగా స్థానాలను ఆయన టార్గెట్ చేసుకున్నారు.
ఇక్కడ బీజేపీ గట్టిపోటీనే ఇస్తోంది.దీనికి తోడు జనసేన పార్టీ మద్దతు కూడా బిజెపికి ఉండడంతో టీఆర్ఎస్ కలవరపడుతోంది.
కాంగ్రెస్ ను ఇక్కడ పెద్దగా పట్టించుకోకపోయినా,బీజేపీ, టిఆర్ఎస్ లో ఆందోళన ఎక్కువైంది.త్వరలోనే తెలంగాణ సీఎం కేటీఆర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉండడంతో, ఆయన గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇక్కడ విజయాన్ని నమోదు చేసుకుని ఆ తర్వాత సీఎం కుర్చీలో కూర్చో వాలి అనేది ఆయన టార్గెట్ గా కనిపిస్తోంది.అయితే ఇక్కడ అకస్మాత్తుగా వచ్చిన వరదలు కారణంగా, గ్రేటర్ పరిధిలోని జనాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు ప్రభుత్వంపై నెలకొన్నాయి.
ఈ రెండు ఎన్నికలపై కేసీఆర్ పదేపదే సమీక్షలు నిర్వహిస్తూ, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిందిగా కోరుతూ ఉండడంతో, గతం కంటే ఎక్కువగానే కష్టపడుతూ, తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.గతం నుంచి హరీష్ రావు, కేటీఆర్ ట్రాక్ రికార్డ్ చూస్తే, వారు అన్ని విషయాలోనూ, సక్సెస్ అవుతూ వస్తున్నారు.
వారికి ఏ బాధ్యతలు అప్పగించినా, సమర్ధవంతంగా నిర్వహిస్తూ, మంచి పేరు ప్రఖ్యాతలు ఆ పార్టీలో తెచ్చుకుంటున్నారు.ఈ ఎన్నికల్లోనూ అదే మాదిరిగా తమ ప్రతిభను నిరూపించుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.