యావత్ సృష్టినీ సృష్టించింది అమ్మవారు.త్రిమూర్తుల్ని సైతం తన ఉగ్ర రూపంతో భయపెట్టగల శక్తి స్వరూపిణి.
ఈ లోకాన్ని సృష్టించాలన్నా,అంతం చేయాలన్నా అమ్మ వారికే సాధ్యం.అంతటి మహిమ గల అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలసిన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం.
ఈ క్షేత్రం సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనదిగా విరాజిల్లుతోంది.మహిమాన్విత శక్తి స్వరూపిణీ అయిన అమ్మవారు నీలాచల్ పర్వతశ్రేణి అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున గౌహతికి సమీపంలో వెలసింది.
ఈ అమ్మవారిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు.ఈ శక్తిపీఠం చాలా మహిమ గల పుణ్యక్షేత్రమని భక్తుల విశ్వాసం.ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విగ్రహారాధనా జరగదు.ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని ఇక్కడ పూజిస్తారు.
సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది.కామాఖ్య దేవాలయం శివుడు, సతీదేవిల శృంగారభరితమైన ప్రదేశమని కొందరు భక్తులు విశ్వసిస్తారు.
కామాఖ్యా దేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవీకి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది.
ఈ మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు.నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు.
అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు.ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు.
ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం.

ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది.అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది.ఈ రూపం చాల భయంకరంగా ఉంటుంది.
ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినియై దర్శనమిస్తుంది.పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా మారుతుంది.
ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తుంటారు.