కృష్ణాజిల్లా: అంబులెన్సుకు, ఆర్టీసీ బస్సులకు కూడా దారి ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చాలగాటమాడుతూ కృష్ణా కరకట్టపై జరుగుతున్న ఇసుక దోపిడీపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రకృతి వనరులను నాశనం చేస్తూ నదీ పరీవాహక ప్రాంతాల్లోని ఇసుక మేటలను జగన్మోహనరెడ్డి అనుయాయులు ఆదాయవనరుగా మార్చుకొని అక్రమార్జన చేస్తున్న వారికి ప్రజలే బుద్ధిచెబుతారని కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోతులు పడ్డ అవనిగడ్డ రహదారిపై జనసేన నేతలతో కలిసి శ్రమదానం చేశారు.
అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవస్థలు నిద్రలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓ వైపు ప్రజలు వరదలు, అధిక వర్షాలతో అల్లాడుతుంటే వన్ టైం సెటిల్మెంటు పేరుతో వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని ఇసుక మాఫియా కోరల్లో సామాన్యులు భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారన్నారు.అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో రహదారుల పరిస్తితి దారుణంగా ఉందని పాలన చేయాల్సిన ముఖ్యమంత్రి వర్క్ ఫ్రేమ్ హోమ్ ముఖ్యమంత్రిగా మారిపోయాడని, రాష్ట్రంలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని రాబోయో రోజుల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
జన సైనికులు వ్యవస్థల పట్ల గౌరవం కలిగి ఉన్నారని, గ్రామానికి సేవ చేద్దామని ఎందరో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారని కానీ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని ప్రభుత్వం అక్రమ కేసులతో స్థానిక సంస్థలను అక్రమంగా గెలుచుకుందన్నారు.
పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన 14, 15 ఆర్ధిక సంఘం నిధులను ప్రభుత్వం దొడ్డిదారిన దారిమళ్లించిందని ఇలాంటి పాలన ముందెన్నడూ చూడలేదని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.151 మంది ఎమ్మెల్యేల బలంతో సాగించాల్సిన పాలన ఇదేనా అని మనోహర్ విమర్శించారు.డిసెంబరు 31 లోపు జనసేన పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారని, క్షేత్రస్థాయిలో పని చేసే ప్రతీ కార్యకర్తకు జనసేన కమిటీలతో స్థానం కల్పిస్తామన్నారు.
గడచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను అభినందిస్తూ ఇదే తెగువతో కార్యకర్తలు పనిచేస్తే జనసేన గెలవబోయే నియోజకవర్గాల్లో అవనిగడ్డ మొదటి వరుసలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ కార్యకర్తలకు సభ్యత్వ కిట్ లను అందచేశారు.ఈ సందర్భంగా తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు చెందిన పలువురు వార్డు సభ్యులు, కార్యకర్తలు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోగా మనోహర్, కృష్ణాజిల్లా అధ్యక్షుడు బంద్రెడ్డి రామకృష్ణలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అంతకు ముందు పులిగడ్డ వంతెన దగ్గర నుంచి జనసైనికులు మోటార్ సైకిల్ ర్యాలీతో మనోహర్ కు స్వాగతం పలికారు.