హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది.ఎన్నికల నోటిఫికేషన్ సైతం అక్టోబర్ ఒకటో తేదీన వెలువడబోతోంది.
ఇప్పటికే ఎన్నికల ప్రచారం లో అన్ని పార్టీలు నిమగ్నమై పోయాయి.టిఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన అక్టోబర్ ఒకటో తేదీన వెలువడుతోంది.అసలు ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రోజు నుంచే హోరాహోరీగా బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి.
ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అందుకే హుజురాబాద్ గెలుపు బాధ్యతలను మంత్రి హరీష్ రావు కు కేసీఆర్ అప్పగించారు.
మిగతా మంత్రులు, ఎమ్మెల్యే లకు నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించారు.ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలిసే విధంగా దిశానిర్దేశం చేశారు.ఇక దళిత బందు వంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేశారు.ఇవన్నీ ఇలా ఉంటే హుజురాబాద్ పోలింగ్ సమయానికి సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది.
అక్టోబర్ 30న పోలింగ్ జరగబోతూ ఉండడం తో టిఆర్ఎస్ ఏ విధంగా అక్కడి ఓటర్లను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గంలో పర్యటిస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠ గానే ఉంది.

కొద్ది రోజుల క్రితం హుజురాబాద్ లో కెసిఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.అక్కడ దళిత బంధు పథకం పై నే పూర్తిగా ఆయన మాట్లాడారు.గతంలోనూ దుబ్బాక లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వెళ్ళలేదు.హైదరాబాద్ లోనే మకాం వేసి పార్టీ శ్రేణుల ద్వారా ఆయన రాజకీయాన్ని నడిపించారు.అయితే అక్కడ టిఆర్ఎస్ కు పరాజయం ఎదురైంది.దీంతో ఆ తర్వాత జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందే కేసీఆర్ ఆ నియోజకవర్గంలో పర్యటించారు.
అయితే ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన ఈటెల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా ఉన్న కేసీఆర్ ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తారా లేదా అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.ఒకవేళ కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా అక్కడ కనుక టీఆర్ఎస్ ఓటమి చెందితే, కెసిఆర్ స్వయంగా ప్రచారానికి దిగినా ఫలితం దక్కలేదనే అభిప్రాయాలు అందరిలోనూ కలుగుతాయని, ఆ ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందనే ఆలోచనలనూ ఉండడంతో కేసీఆర్ హుజురాబాద్ పర్యటన, ప్రచారం విషయమై టిఆర్ఎస్ లో సందిగ్ధ వాతావరణం నెలకొంది.