పెదాల మూలల్లో పగుళ్ళు అనేవి చాలా బాధకరంగాను మరియు చాలా ఇబ్బందికరమైన సమస్య అని చెప్పవచ్చు.ఈ సమస్య ఇన్ఫెక్షన్ లేదా ప్రాణాంతక సమస్య కానప్పటికీ చాలా బాధగా ఉంటుంది.
ఈ సమస్య కారణంగా తినటానికి,త్రాగటానికి, మాట్లాడానికి ఇబ్బందిగా ఉంటుంది.ఆ ప్రాంతంలో ఎరుపుదనం,బొబ్బలు ఉండుట వలన చాలా బాధాకరంగా ఉంటుంది.
ఈ సమస్యకు పొడి చర్మం, అనేక వైరల్ లేదా శిలీంధ్ర వ్యాధులు,ఇనుము మరియు జింక్ వంటి ఖనిజాల లోపం,అలెర్జీ, వాతావరణంలో మార్పులు వంటివి కారణాలుగా చెప్పవచ్చు.మనం ఈ పగుళ్ళకు కొన్ని ఇంటి నివారణల ద్వారా ఉపశమనం పొందవచ్చు.
1.కొబ్బరి నూనె
కొబ్బరి నూనె నోటి కార్నర్ లో(పెదాల మూల) పగుళ్ళను తగ్గించటానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది.
కొబ్బరి నూనెలో సమృద్దిగా నీరు, సంతృప్త కొవ్వులు, వివిధ కొవ్వు ఆమ్లాలు మరియు ఖనిజాలు ఉంటాయి.అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి.స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ప్రభావిత ప్రాంతంలో రాయాలి.ఇది చర్మానికి తేమను కలిగించి పగుళ్ళు తగ్గటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
2.మెంతులు మరియు ఆలివ్ నూనె
మెంతులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ మరియు క్రిమినాశక లక్షణాలు ఉంటాయి.మెంతులు మృదువుగా మారటానికి నీటిలో నానబెట్టాలి.నానిన మెంతులను మెత్తని పేస్ట్ గా చేయాలి.మెంతుల పేస్ట్ లో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ని వేసి బాగా కలిపి ప్రభావిత ప్రాంతంలో రాయాలి.మెంతులు ఇన్ ఫెక్షన్ తగ్గిస్తే ఆలివ్ ఆయిల్ తేమను అందిస్తుంది.ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే మంచి పలితం కనపడుతుంది.
3.బాదాం మరియు జీడిపప్పు
బాదాం మరియు జీడిపప్పు మృదువుగా మారటానికి కొంచెం పాలలో నానబెట్టాలి.నానిన బాదాం మరియు జీడిపప్పును మెత్తని పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.బాదాం మరియు జీడిపప్పు రెండింటిలోను విటమిన్ E, వివిధ ఖనిజాలు మరియు సహజ నూనెలు సమృద్దిగా ఉంటాయి.
4.తేనే మరియు కలబంద
తేనే మరియు కలబందలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు క్రిమినాశక లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని మృదువుగా చేయటంలో సహాయపడుతుంది.అంతేకాక మచ్చలు,గాట్లను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఒక స్పూన్ కలబంద జెల్ లో ఒక స్పూన్ తేనే కలిపి ప్రభావిత ప్రాంతంలో రాయాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తే మంచి పలితం కనపడుతుంది.